గురువారం 04 జూన్ 2020
National - May 15, 2020 , 13:39:19

మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు తమిళనాడులో మద్యం షాపులను మూసివేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశంలో కరోనా మహమ్మారి విస్తరించడంతో అన్ని రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ మార్చి 24 నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే మే 3న లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు ఇతర రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 

అయితే రాష్ట్రంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు మద్యం దుకాణాలు తెరువడంవల్ల వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రాష్ట్రంలో మద్యం షాపులను మూసివేయాలని, ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టాలని తీర్పు వెలువరించింది. అయితే మద్రాస్ హైకోర్టు తీర్సును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.      

  

   


logo