e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides మౌనంగా కూర్చోబోం!

మౌనంగా కూర్చోబోం!

మౌనంగా కూర్చోబోం!
  • పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడటం మా బాధ్యత
  • విధానాలపై న్యాయసమీక్ష మేం చేయాల్సిన పనే
  • కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానం సరిగా లేదు
  • మీకో ధర, రాష్ర్టాలకు మరో ధర సహేతుకం కాదు
  • బడ్జెట్‌లో కేటాయించిన రూ. 35 వేల కోట్లు ఏవి?
  • 18-44 ఏండ్ల వారికి ఉచితంగా ఎందుకు వేయరు?
  • ఎన్ని డోసులకు ఆర్డర్లు ఇచ్చారు? ఎన్ని వచ్చాయి?
  • దేశంలోఎంతమందికి కరోనా టీకాలు వేశారు?
  • బీజేపీ సర్కార్‌ను నిలదీసిన సర్వోన్నత న్యాయస్థానం
  • రెండువారాల్లో వివరాలు సమర్పించాలని ఆదేశాలు

న్యూఢిల్లీ, జూన్‌ 2: ప్రభుత్వ విధానాల ఫలితంగా పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లుతున్నప్పుడు న్యాయస్థానాలు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చోలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం దేశమంతటా అలుముకున్న వేళ మోదీ సర్కార్‌ అనుసరిస్తున్న వ్యాక్సినేషన్‌ విధానం ఏమాత్రం సముచితంగా లేదని దుయ్యబట్టింది. 45 ఏండ్లు దాటిన వారికి ఉచితంగా టీకాలు వేస్తూ, 18-44 ఏండ్ల వారు మాత్రం రుసుము చెల్లించి టీకాలు వేయించుకోవాలని చెప్పటం అహేతుకంగా, ఏకపక్షంగా ఉందని పేర్కొంది. దీనిని సమీక్షించాలని ఆదేశించింది. ‘దేశంలో కరోనా విపత్తు.. దానిని ఎలా ఎదుర్కొంటున్నారు’ అనే అంశాన్ని సుమోటోగా తీసుకొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణను కొనసాగించింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించి వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో బుధవారం అప్‌లోడ్‌ చేశారు. ఆ వివరాలు..

న్యాయసమీక్ష రాజ్యాంగం అప్పగించిన బాధ్యత
కరోనా వ్యాప్తిని అడ్డుకోవటానికి తాము చేపట్టిన విధానాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దని, ఇది విధాన నిర్ణయాల ప్రక్రియలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవటం లాంటిదేనని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొనటాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ‘అధికారాల వికేంద్రీకరణ అనేది రాజ్యాంగం మౌలిక స్వభావం. విధాన నిర్ణయం కార్యానిర్వాహక వ్యవస్థకు సంబంధించినదే. కానీ, విధానాలపై న్యాయసమీక్ష జరుపకుండా న్యాయవ్యవస్థకు అధికారం లేదనటం దీని అర్థం కాదు. పౌరుల రాజ్యాంగపరమైన హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నప్పుడు కోర్టులు మౌనంగా కూర్చోవాలని రాజ్యాంగం చెప్పలేదు. విధానాలపై న్యాయసమీక్ష అనేది కోర్టులకు రాజ్యాంగం అప్పగించిన బాధ్యత’ అని తేల్చిచెప్పింది. టీకాల సేకరణకు 2021-22 కేంద్ర బడ్జెట్‌లో రూ.35 వేల కోట్ల మొత్తాన్ని కేటాయించిన అంశాన్ని గుర్తుచేస్తూ.. ‘ఇప్పటివరకూ ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలి. 18-44 ఏండ్ల వయసున్న వారికి ఉచితంగా టీకాలు వేయటానికి ఈ నిధులను ఎందుకు ఉపయోగించకూడదు? సెకండ్‌వేవ్‌లో ఈ వయసువాళ్లలో అనేకమంది కరోనా బారిన పడి తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్‌ తొలి రెండు దశల్లో పలువర్గాల వారికి (45 ఏండ్లకుపైబడిన వారికి) ఉచితంగా టీకాలను అందించిన కేంద్రం.. ఆ తర్వాత దశల్లో 18-44 ఏండ్ల వారిని డబ్బులు చెల్లించి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని చెప్పటం, ఆ బాధ్యతను కూడా రాష్ట్రప్రభుత్వాలకు, ప్రైవేటు దవాఖానలకు అప్పగించటం అహేతుకంగా, ఏకపక్షంగా ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది.

ధరల్లో వ్యత్యాసం కారణంగా రాష్ర్టాలపై భారం
దేశంలో టీకాలను ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థల నుంచి కేంద్రం సగం టీకాలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ, మిగిలిన సగాన్ని ఎక్కువ ధరకు రాష్ట్రప్రభుత్వాలకుగానీ, ప్రైవేటు దవాఖానలకుగానీ ఆ కంపెనీలు అమ్ముకోవచ్చని కేంద్రప్రభుత్వం అనుమతించటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విధానం ఫలితంగా రాష్ట్రాలపై భారం పడుతుందని, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలకు ఇది మరింత భారంగా పరిణమిస్తుందని పేర్కొంది. వేర్వేరు ధరలకు అనుమతిస్తూ తాము ఆమోదించిన వ్యాక్సినేషన్‌ విధానం ఫలితంగా ప్రైవేటు టీకా కంపెనీల మధ్య పోటీ తలెత్తి టీకాలు తక్కువ ధరకు లభిస్తాయన్న కేంద్రం వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. టీకా కంపెనీలు అప్పటికే ఒక స్థిరమైన ధరను పెట్టినప్పుడు.. ఇక ధరలు తగ్గే ప్రసక్తి ఎక్కడిదని నిలదీసింది. కేంద్రం వాదన నమ్మశక్యంగా లేదని స్పష్టంచేసింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిను పెంచేవిధంగా, ధరలను నియంత్రించే విధంగా అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేస్తారా అన్నదానిపై కేంద్రం స్పష్టతనివ్వాలని పేర్కొంది.

గ్రామాలు, నగరాల వారీగా వివరాలుండాలి
దేశంలో అమలవుతున్న వ్యాక్సినేషన్‌ విధానానికి సంబంధించిన అన్ని రికార్డులను తమకు అందజేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వివరాల్లో.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వీ టీకాల కొనుగోలుకు ఇప్పటివరకూ ఇచ్చిన ఆర్డర్లు, ఏయే తేదీల్లో ఎంతమొత్తంలో టీకాలు వచ్చాయి అన్న సమాచారం కూడా ఉండాలని నిర్దేశించింది. దేశంలో ఇప్పటివరకూ ఎంతమందికి తొలిడోసు, రెండుడోసుల వ్యాక్సిన్లు వేశారన్నది గ్రామాలు, నగరాలవారీగా వివరాలను సమర్పించాలని, మిగిలినవారికి టీకాలు ఇచ్చే అంశంపై ఉన్న ప్రణాళికలను కూడా అందజేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స అందించే ఔషధాలు అందుబాటులో ఉండేలా ఏమేం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని సూచించింది. రాష్ట్రప్రభుత్వాలు తమ పరిధిలోని ప్రజలకు టీకాలు ఉచితంగా వేస్తాయని కేంద్రం మే 9న సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నదని.. ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మూడోవేవ్‌ గురించి సన్నద్ధంగా ఉన్నారా?
ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఎన్ని డోసుల టీకాలు అందుబాటులో ఉంటాయి? కరోనా మూడోవేవ్‌ వస్తుందని, దాని ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో పిల్లలను కాపాడుకోవటానికి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలేమిటి? వాటికి సంబంధించిన ఏర్పాట్లు, ఔషధాలు మొదలైన్న వివరాలను, ప్రణాళికలను తమకు సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రానికి, రాష్ట్రాలకు రెండువారాల వ్యవధినిస్తూ విచారణను జూన్‌ 30వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మౌనంగా కూర్చోబోం!

ట్రెండింగ్‌

Advertisement