బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 02:20:45

నేవీలోనూ మహిళలకు శాశ్వత కమిషన్‌

నేవీలోనూ మహిళలకు శాశ్వత కమిషన్‌

-సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు

న్యూఢిల్లీ, మార్చి 17: భారత నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ (పర్మినెంట్‌ కమిషన్‌) మంజూరుకు మార్గం సుగమం చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. శారీరక పరిస్థితుల కారణంగా మహిళలకు సమాన హక్కులు నిరాకరించడం తగదని స్పష్టంచేసింది. వారికి శాశ్వత కమిషన్‌కు మూడు నెలల్లోగా విధివిధానాలు రూపొందించాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. సైన్యంలోనూ షార్ట్‌ సర్వీస్‌ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ మంజూరు చేస్తూ ఇదే ధర్మాసనం నెల కిందట చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమాన అవకాశాలు కల్పించడం వల్ల మహిళలు ‘తరతరాల వివక్ష’ నుంచి బయటపడేందుకు వీలవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. నేవీలో పర్మినెంట్‌ కమిషన్‌ ద్వారా నియమితులైన వారు రిటైరయ్యేదాకా కొనసాగుతారు. అదే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా చేరే వారు 10 ఏండ్ల వరకు మాత్రమే పనిచేసే వీలుంది. ఆపై మరో నాలుగేండ్లు పొడిగించవచ్చు. 


logo