మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 14:43:48

హత్రాస్ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించనున్న అలహాబాద్‌ హైకోర్టు

హత్రాస్ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించనున్న అలహాబాద్‌ హైకోర్టు

లక్నో : హత్రాస్‌లోని బుల్‌గారి గ్రామంలో బాలికపై సామూహిక లైంగికదాడి, హత్య కేసులో దాఖలైన దరఖాస్తులపై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. కేసును ఢిల్లీకి బదిలీ చేయడాన్ని తర్వాత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేసిన తరువాత కేసు బదిలీపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. సీబీఐ తన స్థితి నివేదికను ఇకపై అలహాబాద్ హైకోర్టుకు సమర్పించనున్నది. ఈ కేసుకు సంబంధించిన అంశాలు, బాధితురాలి కుటుంబం, సాక్షుల భద్రతను అలహాబాద్ హైకోర్టు చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

హత్రాస్ కేసుకు సంబంధించిన ఆదేశాలలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తిని మన్నించి బాధితురాలు పేరును తొలగించాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. అక్టోబర్ 15 న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి చెందిన న్యాయవాది సీమా కుష్వాహా, న్యాయవాది ఇందిరా జై సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలని, కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని, బాధితురాలి కుటుంబంతోపాటు సాక్షులకు యూపీ పోలీసులకు బదులుగా కేంద్ర బలగాలతో భద్రతను కేటాయించాలని, సుప్రీంకోర్టు రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. బాధితురాలు కుటుంబంతోపాటు సాక్షులకు యూపీ ప్రభుత్వం మూడు స్థాయిల రక్షణ కల్పించింది. సాక్షులు, బాధితుల ఇండ్లలో సీసీటీవీలను ఏర్పాటుచేశారు. పోలీసులు బ్లాక్ వద్ద, ఇంటి వెలుపల కాపలాగా ఉన్నారు. ఇది కాకుండా సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

బుల్‌గారి గ్రామంలో బాలికపై సామూహిక లైంగికదాడి, హత్య కేసును తేల్చేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. అక్టోబర్ 11 న సీబీఐకి చెందిన ఘజియాబాద్ యూనిట్ ప్రధాన నిందితుడు సందీప్‌పై చంద్పా కొత్వాలిలో నమోదైన కేసు ఆధారంగా కేసు నమోదు చేసింది. ఇప్పటివరకు 17 రోజుల్లో బాధితురాలి కుటుంబంతోపాటు నిందితుల కుటుంబాన్ని సీబీఐ ప్రశ్నించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.