సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 01:30:10

ఉరే తరువాయి!

ఉరే తరువాయి!
  • నిర్భయ దోషులకు ముగిసిన ‘న్యాయ’ అవకాశాలు
  • ముకేశ్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
  • ఐసీజేను ఆశ్రయించిన మిగతా ముగ్గురు దోషులు

 న్యూఢిల్లీ, మార్చి 16: నిర్భయ కేసులోని నలుగురు దోషులైన అక్షయ్‌ సింగ్‌,  పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌లను శుక్రవారం ఉరి తీయడం ఖాయంగా కనిపిస్తున్నది. వారికున్న న్యాయ అవకాశాలన్నీ ముగిసిపోయాయి. క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు పునరుద్ధరించాలన్న ముకేశ్‌ సింగ్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. అతడికి న్యాయపరమైన ఏ అవకాశాలు లేవని పేర్కొంది. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు, న్యాయవాది వృందా గ్రోవర్‌ కలిసి నేరపూరిత కుట్ర, మోసానికి పాల్పడి తనను తప్పుదోవ పట్టించారంటూ ముకేశ్‌ తన తాజా పిటిషన్‌లో ఆరోపించాడు. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, తన క్యురేటివ్‌, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ ఆదేశాలను రద్దు చేయాలంటూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ ద్వారా కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, ఎంఆర్‌ షా ధర్మాసనం దీనిపై సోమవారం విచారణ జరిపింది. పిటిషన్‌ పరిశీలించదగినది కాదంటూ తిరస్కరించింది. 

కారుణ్య మరణం ప్రసాదించండి

మరోవైపు కారుణ్యమరణానికి అవకాశం కల్పించాలంటూ దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆదివారం లేఖ రాశారు. ‘కారుణ్యమరణానికి అనుమతివ్వాలని మిమ్మల్ని, బాధితురాలి తల్లిని కోరుతున్నాం. అప్పడే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా ఆపవచ్చు’ అని పేర్కొన్నారు. 


ఐసీజేలో ఊరట కష్టమే.. 

నిర్భయ దోషులైన అక్షయ్‌ , పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) సోమవారం ఆశ్రయించారు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరారు. అయితే ఐసీజేలో వారికి ఊరట లభించడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఐసీజే ఇలాంటి కేసుల్లో తలదూర్చదని అంటున్నారు. మరోవైపు ఐసీజే.. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందం (ఐసీసీపీఆర్‌), సార్వత్రిక ఒప్పందం ఆధారంగా పని చేస్తుంది. ఆయా నిబంధనల ప్రకారం మరణ శిక్ష విధింపుపై ఎలాంటి నిషేధం లేదు. ఐసీసీపీఆర్‌లోని ఆర్టికల్‌-6 ప్రకారం మాత్రం కొన్ని పరిమితులున్నాయి. మరణ శిక్ష విధించే ముందు సమగ్రంగా న్యాయ విచారణ జరుగాలి. నేరానికి పాల్పడిన సమయంలోనే దోషులకు శిక్ష విధించకూడదు. క్షమాభిక్ష హక్కును ఉల్లంఘించకూడదు. దోషి వయసు 18 ఏండ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు, దోషి గర్భవతిగా ఉన్నప్పుడు మరణ శిక్ష విధించకూడదు. దోషికి ఉన్న న్యాయ విచారణ హక్కును పరిగణలోకి తీసుకోవాలి. నిర్భయ దోషుల విషయంలో ఈ నిబంధనలన్నింటినీ భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పాటించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 


logo