శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 12:36:04

ఖైదీలకు ‘కరోనా’ ఊరట!

ఖైదీలకు ‘కరోనా’ ఊరట!

న్యూఢిల్లీ: మానవాళికి ముప్పుగా మారిన కరోనా వల్ల ఖైదీలకు కాస్త ఊరటకలుగనున్నది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించే అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌లు ఎల్‌ఎన్‌ రావు, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా జైళ్ల ఉన్న ఖైదీలను పెరోల్‌ లేదా మధ్యంతర బెయిల్‌పై విడుదలకు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. దోషులుగా తేలి జైలు శిక్ష పడిన ఖైదీలు, ఏడేండ్ల వరకు జైలు శిక్ష అవకాశమున్న నేరాలకు పాల్పడిన రిమాండ్‌ ఖైదీల విడుదల అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది.

నేర తీవ్రతనుబట్టి ఖైదీలను కేటగిరీల వారిగా విభజించి పెరోల్‌ లేదా మధ్యంతర బెయిల్‌పై విడుదలకు ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. అలాగే కేసుల విచారణ నిమిత్తం రిమాండ్‌ ఖైదీలను కోర్టులకు, ఇతర జైళ్లకు తరలించడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో జైళల్లో ఖైదీల రద్దీని తగ్గించేందుకు దోషులు, రిమాండ్‌ ఖైదీలను ప్రత్యేక పెరోల్‌ లేదా ఫర్‌లో కింద విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ హైకోర్టుకు సోమవారం తెలిపింది. 



logo