బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 03:25:41

ఆర్మీలో మహిళా కమాండర్లు

ఆర్మీలో మహిళా కమాండర్లు
  • శారీరక లక్షణాల ఆధారంగా మహిళలపై వివక్ష తగదు
  • మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా కల్పించండి
  • కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
  • వారు కమాండింగ్‌ విధులను సమర్థంగా నిర్వహించగలరు
  • స్త్రీల పట్ల ఆలోచనావిధానాన్ని మార్చుకోవాలని హితవు
  • తీర్పుపై మహిళా సైనికాధికారుల హర్షం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న మహిళలు.. సైన్యంలోనూ అత్యున్నత స్థానానికి చేరుకునే సమయం వచ్చింది. భారతదేశం మహిళల సారథ్యంలో అంగారకుడి వరకు ఉపగ్రహాన్ని పంపినా.. ఆర్మీలో మాత్రం సమాన అవకాశాలు అందని దుస్థితి. పైగా కమాండర్లుగా పనిచేయడానికి వారి శారీరక సామర్థ్యం సరిపోదంటూ అవమానాలు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ లింగవివక్షకు సుప్రీంకోర్టు చరమగీతం పాడింది. సైన్యంలో మహిళలు పురుషులతో సమానంగా అత్యున్నత స్థాయికి ఎదిగేలా కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ‘శాశ్వత కమిషన్‌' హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


మూడు నెలల్లోగా హోదా ఇవ్వండి 

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్‌ కల్పిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం జస్టిస్‌లు డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధనల వల్లే మహిళలను కమాండ్‌ పోస్టుల్లో నియమించడం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ వాదనపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళా అధికారుల పట్ల ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని కేంద్రానికి హితవు పలికింది. సైన్యంలో లింగవివక్షకు చరమగీతం పాడాలని స్పష్టం చేసింది. 


మహిళలను కమాండ్‌ పోస్టుల్లో నియమించకుండా చట్టబద్ధమైన నిషేధమేమీ లేదని గుర్తుచేసింది. విధానపరమైన నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. కోర్టులు ఇచ్చిన తీర్పును అమలుచేయడంపై కేంద్ర ప్రభుత్వం దశాబ్దకాలంగా అశ్రద్ధ చూపిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఎలాంటి స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు 2011 సెప్టెంబర్‌ 2న స్పష్టం చేసింది. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు తగిన గౌరవం ఇవ్వలేదు’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సైన్యంలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు ఇవ్వడం ఒక కీలక పరిణామమని, కేంద్రం వెంటనే ఢిల్లీ హైకోర్టు తీర్పును అమలు చేయాలని సూచించింది. ప్రస్తుతం సైన్యంలో 1,653 మంది మహిళా అధికారులు ఉన్నారని, ఇది సైన్యంలోని మొత్తం అధికారుల్లో 3.89 శాతమని పేర్కొన్నది. సర్వీస్‌తో సంబంధం లేకుండా అర్హులందరికీ శాశ్వత కమిషన్‌ కల్పించాలని ఆదేశించింది. ఇందుకు మూడు నెలలు గడువు విధించింది. 


సైన్యానికి గొప్ప గౌరవం తీసుకొచ్చారు 

స్వాతంత్య్రం అనంతరం గత 70 ఏండ్లుగా ఎంతో మంది మహిళలు సైన్యంలో పనిచేశారని, దేశానికి గొప్ప గౌరవం తీసుకొచ్చారని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. వారు సమర్థంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలను గెలుచుకున్నారని, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో పనిచేసినందుకు అవార్డులను సైతం అందుకున్నారని గుర్తుచేసింది. శారీరక లక్షణాల ఆధారంగా వారిపై వివక్ష చూపడం, అవకాశాలను దూరం చేయడం తప్పు అని వ్యాఖ్యానించింది. 


సామర్థ్యం సరిపోదు.. మేము సమర్థులమే! 

అంతకుముందు.. కేంద్ర ప్రభుత్వం, మహిళా సైనికాధికారులు తమ వాదనలను లిఖిత పూర్వకంగా సుప్రీంకోర్టుకు సమర్పించాయి. కమాండర్‌ పోస్టుల్లో మహిళలను నియమించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. శారీరక సామర్థ్యం, సామాజిక పరిమితులతోపాటు అనేక కారణాలు అడ్డంకులుగా మారాయని పేర్కొన్నది. అంతేకాకుండా మహిళలను అధికారులుగా అంగీకరించడానికి సైన్యంలోని కొందరు పురుషులు సిద్ధంగా లేరని పేర్కొన్నది. దీనిపై మహిళా సైనికాధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. 


కేంద్రం వాదనలు తిరోగమనాన్ని సూచిస్తున్నాయని, గణాంకాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 28 ఏండ్లుగా తాము ఆయుధాలు చేపట్టి పోరాడుతూ, శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నామన్నారు. తమకు అప్పగించిన ఏ పనిలోనూ వెనుకంజ వేయలేదని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే కోర్టు బయట ఉన్న పలువురు మహిళా సైనికాధికారులు సంబురాలు చేసుకున్నారు. ఈ తీర్పు దేశంలోని మహిళలందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. న్యాయవాది మీనాక్షి లేఖి తమ తరఫున ఉచితంగా వాదనలు వినిపించి గెలిపించారని కొనియాడారు. 


ఏమిటీ శాశ్వత కమిషన్‌?


సైన్యంలో చేరే సమయంలో రెండు ఆప్షన్లు ఉంటాయి. అవే పర్మనెంట్‌ కమిషన్‌ (పీసీ) లేదా శాశ్వత కమిషన్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ). శాశ్వత కమిషన్‌లో చేరేవారికి  పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ లేదా డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, గయలోని ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు. వీరు కనీసం 20 ఏండ్లు సైన్యంలో పనిచేయాలి. 60 ఏండ్ల వయసు వచ్చే వరకు కొనసాగవచ్చు. వయసు, విద్యార్హత, అనుభవం ఆ ధారంగా పదోన్నతులు ఉంటాయి. సైన్యాధిపతి, రక్షణ దళాల అధిపతి (సీడీఎస్‌) స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. 


ఎస్‌ఎస్‌సీలో.. 

ఎస్‌ఎస్‌సీలో చేరేవారు కనీసం పదేండ్లు సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 14 ఏండ్లు మాత్రమే సర్వీస్‌లో ఉంటారు. ఆ తర్వాత తప్పనిసరిగా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. వీరు గరిష్ఠంగా బ్రిగేడియర్‌ స్థాయి వరకు మాత్రమే చేరుకోవచ్చు. ఇంకా సైన్యంలో కొనసాగాలనుకుంటే.. పదేండ్ల సర్వీస్‌ పూర్తయిన తర్వాత శాశ్వత కమిషన్‌కు దరఖాస్తు చేసుకొవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మహిళలకు సైన్యంలో ఎస్‌ఎస్‌సీలో మాత్ర మే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో వారు ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోతున్నారు.


logo