శనివారం 30 మే 2020
National - Apr 01, 2020 , 01:20:53

వలసల్ని నియంత్రించండి

వలసల్ని నియంత్రించండి

  • పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయండి 
  • నిపుణులతో కౌన్సెలింగ్‌ నిర్వహించండి 
  • కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికుల వలసల్ని నియంత్రించాలని కేంద్రప్రభుత్వాన్ని సు ప్రీంకోర్టు ఆదేశించింది. నకిలీ వార్తల వల్ల కరోనాపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో మహమ్మారి గురించి ఎప్పటికప్పుడు వాస్తవిక సమాచారాన్ని అందించే పోర్టల్‌ను 24 గంటల్లోపు ఏర్పా టు చేయాలని తెలిపింది. వైరస్‌ కంటే దాని వల్ల ఏర్పడిన భయమే ఎక్కువమంది ప్రాణాల్ని బలిగొంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న వలస కార్మికులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి సుశిక్షితులైన నిపుణుల సాయాన్ని తీసుకోవాలని సూచించింది. 

ఈ  పునరావాస కేం ద్రాలను పోలీసుల నేతృత్వంలో గాకుండా, వలంటీర్ల ఆద్వర్యంలో నిర్వహించాలని ఆదేశించింది. కార్మికుల వలసల్ని నియంత్రించి వారికి కావాల్సిన ఆహారం, ఆశ్ర యం, పోషణ, వైద్య సదుపాయాలు అందించాలని కేంద్రాన్ని కోరింది. కరోనా నేపథ్యంలో వలస కార్మికుల అంశంపై కేరళ ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నిథన్‌, పశ్చిమ బెంగాల్‌ ఎంపీ ఒకరు వేసిన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావుతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. వలస కార్మికుల అంశంపై హైకోర్టులు మరింత లోతుగా విచారించగలవని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం కేసు విచారణను ఏప్రిల్‌ 7కు వాయిదా వేసింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్రం తరుఫున వాదనలు వినిపించారు. 


నకిలీ వార్తలే పెద్ద అవరోధం: కేంద్రం

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి చురుకైన, సకాలంలో సమర్థవంతమైన చర్యల్ని తీసుకోవడం వల్లనే మహమ్మారిని కట్టడి చేయగలిగామని, నకిలీ వార్తలు పెద్ద అవరోధంగా పరిణమిస్తున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. 40 వేల వెంటిలెటర్లకు ఆర్డర్‌ ఇచ్చామని, 15.25 లక్షల మందికి విమానాశ్రయాల్లో, 40 వేల మందికి నౌకాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.


logo