గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 02:52:50

రిజర్వేషన్లపై రగడ

రిజర్వేషన్లపై రగడ
  • సుప్రీంకోర్టు తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌
  • రిజర్వేషన్లను కాపాడడంలో కేంద్రం విఫలమైందన్న విపక్షాలు.. వాకౌట్‌
  • ఆరోపణల్ని తిప్పికొట్టిన ప్రభుత్వం
  • కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయంపైనే తీర్పు వెలువడిందని విమర్శ
  • రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం పార్లమెంట్‌ దద్దరిల్లింది. కేంద్రం పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. రిజర్వేషన్లను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తాయి. దీనిపై కేంద్ర సామాజిక, సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ లోక్‌సభలో ప్రకటన చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ఈ కేసులో కేంద్రం కక్షిదారు కాదన్నారు. 2012 లో ఉత్తరాఖండ్‌లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపైనే తాజా తీర్పు వెలువడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. కేసు లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు కేం ద్రాన్ని కోరలేదని, ఈ అంశంపై ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాఖండ్‌లో నాటి కాం గ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన ఆదేశాలపైనే కోర్టు తాజా తీర్పునిచ్చిందని మంత్రి అన్నప్పుడు విపక్షాల సభ్యులు ‘సిగ్గు సిగ్గు’ అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. నియామకాల్లో రిజర్వేషన్ల కల్పన రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదని సుప్రీంకోర్టు ఆదివారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 


తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి..

ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే, కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. డీఎంకేతోపాటు ఇతర విపక్షాల సభ్యులు ఆయనకు జతకలిశారు. సున్నితమైన రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటన చేస్తుందన్నారు. ప్రభుత్వంపై విపక్షాల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరగా.. ఆ విషయాన్ని పరిశీలిస్తానని స్పీ కర్‌ బదులిచ్చారు. కాంగ్రెస్‌ నేత అధిర్‌, తృణమూల్‌ సభ్యుడు కల్యాణ్‌ బెనర్జీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పై దాడి జరుగుతున్నదని మండిపడ్డారు. 


ఎన్డీఏ భాగస్వామ్యపక్షం ఎల్జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. దీనిపై ప్రభుత్వం తక్షణం జో క్యం చేసుకుని, రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, తద్వారా దీన్ని సుప్రీంకోర్టులో సవా ల్‌ చేయడానికి వీల్లేకుండా ఉంటుందన్నారు.  కల్యాణ్‌ బెనర్జీ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు రా జ్యాంగబద్ధమని, ప్రాథమిక హక్కని రాజ్యాం గం పేర్కొంటున్నదన్నారు. డీఎంకే సభ్యుడు ఏ రాజా మాట్లాడుతూ.. రిజర్వేషన్లకు కేంద్రం అనుకూలంగా లేదని చెప్పడానికి కారణాలు ఉన్నాయన్నారు. రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. బీఎస్పీ సభ్యుడు రితేశ్‌ పాండే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, దళితులకు కేంద్రం వ్యతిరేకమన్నారు. అప్నాదళ్‌ సభ్యురాలు అనుప్రియా పటేల్‌ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమన్నారు. దీనిపై కేంద్రం ప్రేక్షకపాత్ర వహించరాదని ఐయూఎంఎల్‌ సభ్యుడు ఈటీ మొహమ్మద్‌ బషీర్‌ సూచించారు. కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని సీపీఎం నేత ఏఎం ఆతిఫ్‌ కోరారు. ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ.. తమకు మాటలు అవసరం లేదని, చేతలు కావాలన్నారు.


గెహ్లాట్‌పై హక్కుల నోటీసు ఇస్తాం

రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రి తావర్‌చంద్‌ గెహ్లాట్‌ లోక్‌సభను తప్పుదోవ పట్టించారని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల రద్దుకు మోదీ సర్కారు కుట్రలు పన్నుతున్నదని, దీనిపై ఆందోళనలు చేపడుతామన్నది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. రిజర్వేషన్లను రద్దుచేయడమే బీజేపీ, ఆరెస్సెస్‌ అజెండా అని ఆరోపించారు. 


ప్రతిపాదనలు అవాస్తవికం బడ్జెట్‌పై చర్చలో విపక్షాలు

బడ్జెట్‌ ప్రతిపాదనలు అవాస్తవికమని, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించడం లేదని రాజ్యసభలో విపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి దగ్గరల్లో ఉందని, ‘అసమర్థ వైద్యు లు’ దానికి చికిత్స అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ మాట్లాడుతూ.. ఆర్థికవ్యవస్థ క్లిష్ట పరిస్థితులలో ఉన్నదన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు మానస్‌ రంజన్‌ భూనియా మాట్లాడుతూ.. నార్త్‌ బ్లాక్‌ నుంచి ఆర్థిక కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్నదని, ఇది ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నదని విమర్శించారు. మరోవైపు, వృద్ధి రేటు తగ్గడం, నిరుద్యోగం పెరుగడంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. మజ్లిస్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. మైనార్టీలకు నిధులు తగ్గించడాన్ని లేవనెత్తారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు ప్రస్తావించలేదని విమర్శించారు.


రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి

రాజ్యసభలోనూ రిజర్వేషన్లపై వాడీవేడి చర్చ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలుచేయాలని విపక్షాలు డిమాండ్‌చేశాయి. ప్రభుత్వం నుంచి సంతృప్తికర జవాబు రాకపోవడంతో వాకౌట్‌చేశాయి. పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ మంత్రి గెహ్లాట్‌ ప్రకటన చేశారు. ఈ అంశంపై అత్యున్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర సహాయ మంత్రి రాందాస్‌ అథావలే మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయం అన్యాయమన్నారు. కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ స్పందిస్తూ.. దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎస్సీ,ఎస్టీల ప్రయోజనాలను కాపాడేందుకు మోదీ సర్కారు సాధ్యమైనదంతా చేస్తుందని చెప్పారు. న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 


మంత్రి ప్రకటన అనంతరం ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ఈ అంశం చాలా తీవ్రమైనదని, దేశంలోని నాలుగో వంతు జనాభాపై ప్రభావం పడుతుందని చెప్పారు. తక్షణమే క్యాబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి, రివ్యూ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌చేశారు. బీఎస్పీ సభ్యుడు సతీశ్‌ చంద్ర మిశ్రా మాట్లాడుతూ.. క్యాబినెట్‌ ముందుకు ఈ అంశం వచ్చినప్పుడు.. న్యాయవ్యవస్థలో పదోన్నతుల అంశాన్నీ చేర్చాలని కోరారు. కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని డీఎంకే, టీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీలు డిమాండ్‌చేశాయి. దీనిపై చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొనడంతో.. సంతృప్తిచెందని విపక్షాలు (శివసేన మినహా) సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

logo