బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 18:25:08

కేరళ జర్నలిస్ట్ అరెస్ట్‌పై యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు

కేరళ జర్నలిస్ట్ అరెస్ట్‌పై యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు

న్యూఢిల్లీ : కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్ అరెస్ట్ విషయంలో సోమవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సిద్దిఖీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ, అలాగే సిద్దిఖీకి బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలుపాలని యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీజేఐ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

2020 సెప్టెంబర్14 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అత్యాచార బాధితురాలు తీవ్రగాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ వార్తను కవర్‌ చేసేందుకు హత్రాస్ వెళ్లేందుకు అక్టోబర్ 5 న బయలుదేరిన కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిఖీపై ఉగ్ర వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదుచేసి మథుర జైలుకు పంపించారు. సిద్దిఖీ అరెస్ట్‌ను ఖండించిన కేరళ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిద్దిఖీకి న్యాయ సహాయం అందించాలని, కుటుంబసభ్యులను కలిసే అవకాశం కల్పించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఇదేసమయంలో మథుర జైలులో ఖైదీల హక్కుల ఉల్లంఘన జరుగుతున్నద ఆరోపణలపై కూడా విచారణకు ఆదేశించాలని తమ పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అలహాబాద్ హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందురు రావాల్సి వచ్చిందని పిటిషనర్లను సీజేఐ ప్రశ్నించారు. ఆర్టికల్ 32 పిటిషన్లను ప్రోత్సహించకూడదని ప్రయత్నిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్-32 ఒకవేళ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఉపశమనం కల్పించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.