బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 13:04:08

సీఎం కమల్‌నాథ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

సీఎం కమల్‌నాథ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను మంగళవారమే నిర్వహించాలని సీఎం కమల్‌నాథ్‌కు గవర్నర్‌ లాల్జి టాండన్‌ లేఖ రాసిన విషయం విదితమే. వెంటనే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల తరపున ఎవరూ విచారణకు హాజరు కాలేదు. దీన్ని బీజేపీ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరపున విచారణకు హాజరు కాకపోవడంపై స్పందన తెలియజేయాలంటూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని కోర్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

జ్యోతిరాధిత్య సింధియాకు మద్దతుగా 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో పాటు మంత్రుల రాజీనామాలను కూడా స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ లాల్జి టాండన్‌ స్పీకర్‌కు సూచించారు. 

అయితే కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో.. స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీని మార్చి 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి జరుగనున్న విశ్వాస పరీక్ష వాయిదా పడింది. నిన్న సాయంత్రం సీఎం కమల్ నాథ్ కు గవర్నర్ లేఖ రాశారు. మంగళవారమే బలపరీక్ష నిర్వహించాలని సీఎంను గవర్నర్ ఆదేశించారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కు పడిపోయింది. 112 మంది మద్దతు తెలిపితేనే కమల్‌నాథ్‌ గట్టెక్కుతారు. వారిలో 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించనందున కాంగ్రెస్‌ బలం 108 మందిగా ఉన్నది. ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలుసుకున్నారు. మరో నలుగురు స్వతంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకం.


logo