సెంట్రల్ విస్టాపై ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్లమెంట్ నూతన భవన నిర్మాణం (సెంట్రల్ విస్టా)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. గతేడాది నవంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త పార్లమెంట్, ప్రభుత్వ భవనాల ఆధునికీకరణకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు కేంద్రం రూపకల్పన చేసింది.
కొత్త భవనంలో 900 నుంచి 1,200 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా త్రిభూజాకారంలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం (2022 ఆగస్టు 15) నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. గత డిసెంబర్ 10న పీఎం మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.971 కోట్ల వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేంద్రం చేపడుతోంది. దాదాపు వంద సంవత్సరాల కిందట నిర్మించిన భవనం భవిష్యత్ అవసరాలకు సరిపోదని, అగ్ని ప్రమాదాలతో పాటు అనేక భద్రతా పరమైన సమస్యలున్నాయని, ఈ మేరకు నూతన భవనం అవసరమని కేంద్రం పేర్కొంది.
ప్రాజెక్టు భూ వినియోగంలో చట్ట విరుద్ధమైన మార్పులు, వారసత్వ సంపద పరిరక్షణ నియమాల ఉల్లంఘన, డిజైన్, పర్యావరణ అనుమతులు తదితర అంశాలను లేవనెత్తుతూ సుప్రీం కోర్టులో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్ 10న ప్రాజెక్టు శంకుస్థాపనకు అనుమతినిచ్చిన సుప్రీం కోర్టు.. నిర్మాణాలకు మాత్రం బ్రేక్ వేసింది. తుది తీర్పు వచ్చేంతవరకూ ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు, భవనాల కూల్చివేత, చెట్ల నరికివేత చేపట్టొద్దని ఆదేశించింది.
తాజావార్తలు
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్