శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:11:23

ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు సుప్రీం నోటీసులు జారీ

ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు సుప్రీం నోటీసులు జారీ

ఢిల్లీ : కోర్టు దిక్క‌ర‌ణ కింద కార్య‌క‌ర్త‌, ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా, న్యాయ ప‌రిపాల‌న‌ను అప్ర‌తిష్ట‌పాలు చేసేలా, అవమానకరమైన ట్వీట్లు చేసినందుకుగాను సుప్రీం సుమోటాగా స్వీక‌రించి బుధ‌వారం ప్ర‌శాంత్ భూష‌న్‌కు నోటీసులు జారీచేసింది. భూషణ్ ఇటీవల చేసిన ట్వీట్లను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు, ముఖ్యంగా భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం గౌరవాన్ని, అధికారాన్ని ప్ర‌జ‌ల దృష్టిలో చుల‌క‌న చేసేవిధంగా ఉన్నాయంది.

జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ బి ఆర్ గవై, కృష్ణ మురారిలతో కూడిన ముగ్గురు స‌భ్యుల‌ న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయంలో కేసును సుమోటాగా తీసుకుంది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్‌తో పాటు ట్విట్ట‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. భూష‌ణ్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న ప్రకటనలు న్యాయవ్య‌వ‌స్థ‌ను అప్రతిష్టపాలు చేసేలా, సుప్రీం అధికారాన్ని ప్ర‌శ్నించేలా, గౌర‌వాన్ని తగ్గించేలా ఉన్నాయంది.

నోటీసుల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా పేర్కొంటూ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను సుప్రీం ఆగ‌స్టు 5వ తేదీకి వాయిదా వేసింది. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికుల‌కు సంబంధించిన అంశాల్లో సుప్రీం తీరును ప్ర‌శ్నిస్తూ, న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలను లేవనెత్తుతూ ప్ర‌శాంత్ భూష‌ణ్ ట్విట్ట‌ర్‌లో స్పందించారు. 


logo