సోమవారం 25 జనవరి 2021
National - Dec 18, 2020 , 12:20:29

క‌మెడియ‌న్‌, కార్టూనిస్ట్‌కు సుప్రీంకోర్టు షోకాజు నోటీసులు

క‌మెడియ‌న్‌, కార్టూనిస్ట్‌కు సుప్రీంకోర్టు షోకాజు నోటీసులు

న్యూఢిల్లీ: స‌్టాండ‌ప్ క‌మెడియ‌న్ కునాల్ కామ్రా, కార్టూనిస్ట్ ర‌చితా త‌నేజాల‌కు శుక్ర‌వారం షోకాజు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ ఇద్ద‌రూ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అత్యున్న‌త న్యాయ‌స్థానంపైనా, జ‌డ్జీల‌పైనా వీళ్లు అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఆర్నాబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేయ‌డంపై ఈ ఇద్ద‌రూ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సుప్రీంకోర్టు, జ‌డ్జీల‌ను అవ‌మానించేలా ట్వీట్లు చేశారు. ఈ విష‌యాన్ని గుర్తించిన న్యాయ‌శాస్త్ర విద్యార్థి స్కంద్ బాజ్‌పాయ్‌.. కోర్టు ఉల్లంఘ‌న కేసు దాఖ‌లు చేయ‌డానికి అనుమ‌తించాలంటూ అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్‌ను కోరారు. వారి ట్వీట్ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత అటార్నీ జ‌న‌ర‌ల్ అందుకు అనుమ‌తించారు. 

అయితే తాను చేసిన ట్వీట్ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క్ష‌మాప‌ణ కోర‌బోన‌ని కునాల్ కామ్రా స్ప‌ష్టం చేస్తున్నాడు. ఆర్నాబ్‌కు బెయిల్ విష‌యంలో కోర్టు నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని కునాల్ ఆరోపిస్తున్నాడు. ఇత‌రుల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌లాంటి అంశాల‌లో సుప్రీంకోర్టు నిర్ణ‌యాలు విమ‌ర్శ‌ల‌కు అతీతంగా ఉండ‌కూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇప్ప‌టికే తాను చేసిన ట్వీట్ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు. 

ఇక కార్టూనిస్ట్ ర‌చిత త‌నేజా కూడా ఆర్నాబ్‌కు బెయిల్ విష‌యంలో చేసిన ట్వీట్ల‌పైనే కోర్టు ధిక్క‌ర‌ణ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. కోర్టు బీజేపీకి మేలు చేసింద‌నే ఉద్దేశం వ‌చ్చేలా ఆమె ట్వీట్ చేసింది. ఆర్నాబ్ ఫాద‌ర్ ఎవ‌రో తెలుసా అంటూ సుప్రీంకోర్టును ప్ర‌శ్నిస్తూ ర‌చితా చేసిన ట్వీట్‌.. ప‌రోక్షంగా అధికార బీజేపీని ఉద్దేశించి చేసిందేన‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ వేణుగోపాల్ స్ప‌ష్టం చేశారు. ఇక మ‌రో ట్వీట్‌లో సుప్రీంకోర్టును సంఘీ కోర్ట్ ఆఫ్ ఇండియా అంటూ ర‌చితా అభివ‌ర్ణించ‌డం కూడా కోర్టు ధిక్కర‌ణ కిందికే వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. మూడో ట్వీట్‌లో బీజేపీ నుంచి ఏదో ల‌బ్ధి పొందే అయోధ్య‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింద‌ని ర‌చితా ఆరోపించింది. 


logo