మంగళవారం 31 మార్చి 2020
National - Feb 15, 2020 , 02:49:21

ఆర్నెళ్లు డెడ్‌లైన్‌

ఆర్నెళ్లు డెడ్‌లైన్‌
  • త్రిసభ్య ధర్మాసనంలో విచారణ
  • మరణశిక్షపై నేరస్థుల అప్పీళ్ల విచారణపై సుప్రీంకోర్టు నూతన మార్గదర్శకాలు
  • నిర్భయ దోషుల ఉరి జాప్యం నేపథ్యంలో నిర్ణయం.. వినయ్‌శర్మ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: నిర్భయపై లైంగికదాడి, హత్య కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుపై తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. మరణశిక్షకు సంబంధించిన కేసుల్లో నేరస్థుల అప్పీళ్లపై విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఉరిశిక్షపై దాఖలైన అభ్యర్థనపై విచారణ చేపట్టడానికి ఆర్నెల్లు (హైకోర్టు తీర్పు ప్రకటించిన తేదీ నాటి నుంచి) గడువును విధించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంచింది. హైకోర్టు ఉరిశిక్షను విధించిన/ సమర్థించిన సందర్భాల్లో సంబంధిత కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన తరువాత, అప్పీల్‌ సిద్ధమైందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఆరు నెలల్లోగా త్రిసభ్య ధర్మాసనం ముందుకు సంబంధిత అప్పీల్‌ విచారణకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 


ఉరిశిక్షకు సంబంధించి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలైన వెంటనే.. కేసుకు సంబంధించిన రికార్డులను 60 రోజుల్లోగా పంపాలని సంబంధిత కోర్టుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సమాచారం పంపనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, అదనపు పత్రాలు అవసరమైన పక్షంలో కక్షిదారులు 30 రోజుల్లోగా వాటిని సమర్పించాలని రిజిస్ట్రీ కోరవచ్చని తెలిపింది. ఒకవేళ అదనపు పత్రాలు దాఖలుచేయకపోతే ఆ అంశాన్ని సంబంధిత న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్తారని వివరించింది. న్యాయపరమైన లొసుగులను వినియోగించుకుని నిర్భయ దోషులు తమ ఉరిశిక్షను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తుండడం పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు దోషులు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌కుమార్‌ శర్మ, అక్షయ్‌కుమార్‌లకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ట్రయల్‌కోర్టు జనవరి 31న ఆదేశాలు జారీచేసింది.


నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేత

తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ర్టపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. క్షమాభిక్ష తిరస్కరణపై న్యాయ సమీక్ష కోరేందుకు ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంటూ జస్టిస్‌లు ఆర్‌ భానుమతి, అశోక్‌ భూషణ్‌, ఏఎస్‌ బోపన్నతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను శుక్రవారం కొట్టేసింది. దీంతో తనకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాల్ని వినయ్‌ వినియోగించుకున్నట్టు అయింది. అతని ఉరిశిక్ష అమలుకు మార్గం సుగమమైంది. ‘రాష్ట్రపతి ముందు దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌లో అన్ని అంశాలు పొందుపరిచారు. అయినప్పటికీ, ఆ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. క్షమాభిక్ష తిరస్కరణపై న్యాయ సమీక్ష కోరేందుకు ఎలాంటి ఆధారాల్లేవు. 


దీంతో క్షమాభిక్ష పిటిషన్‌ను సవాల్‌ చేస్తూ దోషి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. వినయ్‌ శర్మ మానసిక పరిస్థితి సరిగా లేదని, జైల్లో అతడిని మానసికంగా వేధించడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని.. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రపతి అతడి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారని వినయ్‌ శర్మ తరఫు న్యాయవాది ఏకే సింగ్‌ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ వాదనల్ని ఖండించారు. దోషి వినయ్‌ మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాడని పేర్కొంటూ.. వినయ్‌ శర్మ మానసిక పరిస్థితిపై బుధవారం వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆధారాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వినయ్‌ పిటిషన్‌ను కొట్టేసింది.


సొమ్మసిల్లి పడిపోయిన న్యాయమూర్తి

నిర్భయ కేసు దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ భానుమతి శుక్రవారం సొమ్మసిల్లి పడిపోయారు. తీర్పును చదువుతున్న సమయంలో ఆమె కండ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఇతర జడ్జిలు, కోర్టు సిబ్బంది హుటాహుటిన ఆమెను ఛాంబర్‌కు తీసుకెళ్లారు. కొద్ది క్షణాల తర్వాత న్యాయమూర్తి స్పృహలోకి వచ్చారు. ఆ తర్వాత కోర్టు ఆవరణలో ఉన్న వైద్య కేంద్రానికి ఆమెను చక్రాలకుర్చీలో తీసుకెళ్లి వైద్యం అందించారు. న్యాయమూర్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదని కోర్టు వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే తీర్పును వెల్లడిస్తామని చెబుతూ.. కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకు కొద్ది సేపటి క్రితమే  నిర్భయ దోషి వినయ్‌ శర్మ పిటిషన్‌పై జస్టిస్‌ భానుమతి ధర్మాసనం తీర్పు వెల్లడించింది. పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదంటూ కొట్టివేసింది. ఆ తర్వాత కాసేపటికి నిర్భయ కేసు దోషులను వేర్వేరుగా ఉరితీయాలన్న  కేంద్రం పిటిషన్‌ను విచారిస్తుండగా జస్టిస్‌ భానుమతి అస్వస్థతకు గురయ్యారు. 


logo
>>>>>>