మంగళవారం 07 జూలై 2020
National - Jun 26, 2020 , 11:26:57

సీబీఎస్ఈ అసెస్‌మెంట్ స్కీమ్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్న‌ల్‌

సీబీఎస్ఈ అసెస్‌మెంట్ స్కీమ్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్న‌ల్‌

హైద‌రాబాద్‌:  ప‌ది, 12వ త‌ర‌గ‌తుల‌కు చెందిన ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన సీబీఎస్ఈ.. అంత‌ర్గ‌త మ‌దింపు ద్వారా ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే అసెస్‌మెంట్ మార్క్‌ల స్కీమ్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.  ఇవాళ ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. సీబీఎస్ఈ స‌మ‌ర్పించిన అసెస్‌మెంట్ స్కీమ్‌ను అంగీక‌రించింది. పెండింగ్‌లో ఉన్న ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సీబీఎస్ఈతో పాటు ఐసీఎస్ఈ గుర‌వారం ప్ర‌క‌టించాయి . అయితే పెండింగ్ ప‌రీక్ష‌లకు అంత‌ర్గ‌త మ‌దింపు ద్వారా మార్క్‌లు వేసి.. ఈ ఏడాది జూలై 15వ తేదీలోగా తుది ఫ‌లితాల‌ను సీబీఎస్ఈ బోర్డు రిలీజ్ చేయ‌నున్న‌ది.  

జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రి, సంజివ్ ఖ‌న్నాల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ కేసు విచారించింది. ఇదే అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిష‌న్ల‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం ర‌ద్దు చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలో సీబీఎస్ఈ ప‌ద‌వ‌, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు తెలియ‌జేశారు.

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు గత ఫిబ్రవరి 15న ప్రారంభం కాగా లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలోనే ఆగిపోయాయి. 10వ తరగతి పరీక్షలు కూడా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు నిర్వహించాల్సి ఉండగా సగంలోనే నిలిచిపోయాయి. ఇంటర్నల్స్‌ ఆధారంగా  ఫలితాలు ప్రకటించేలా బోర్డులను ఆదేశించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. 

ఐసీఎస్ఈ బోర్డు త‌ర‌పున సుప్రీంలో న్యాయ‌వాది జ‌య‌దీప్ గుప్తా వాదించారు. అంత‌ర్గ‌త మ‌దింపు మార్కుల విధానం సీబీఎస్ఈతో పోలిస్తే ఐసీఎస్ఈలో తేడా ఉంటుంద‌ని, అయితే ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అన్నీ అనుకూలించిన‌ప్పుడు ప‌రీక్ష రాసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఐసీఎస్ఈ న్యాయ‌వాది కోర్టుకు తెలియ‌జేశారు. కోర్టుకు సీబీఎస్ఈ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ త‌ర‌హాలోనే త‌మ‌ది కూడా ఉంద‌ని, కానీ స‌గ‌టు మార్కుల విధానం ఒక్క‌టే తేడా ఉంద‌ని జ‌య‌దీప్ తెలిపారు.


logo