శనివారం 28 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 16:22:34

గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకోండి.. తెలంగాణ‌కు సుప్రీం ఆదేశం

గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకోండి.. తెలంగాణ‌కు సుప్రీం ఆదేశం

హైద‌రాబాద్‌:  తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ రెండు గంట‌ల పాటు గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. త‌క్కువ స్థాయిలో కాలుష్యం విడుద‌ల చేసే ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన ప‌టాకులు పేల్చేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  రాత్రి 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప‌టాకులు కాల్చుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది.  జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, సంజీవ్ ఖ‌న్నాల‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ తీర్పును వెలువ‌రించింది. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన అత్య‌వ‌స‌ర విచార‌ణ‌లో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. 

రాష్ట్రంలో ప‌టాకులు అమ్మ‌రాదు, కాల్చ‌రాదు అని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో.. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆ దేశాలు పాటించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది.  దీంతో తెలంగాణ ఫైర్‌వ‌ర్క్స్ డీల‌ర్స్ సంఘం ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు పండుగ వేళ రెండు గంట‌ల పాటు బాంబులు పేల్చుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.  న‌వంబ‌ర్ 9న జాతీయ గ్రీన్ ట్రిబ్యుల్ విధించిన ఆంక్ష‌లు అమ‌లు అయ్యేలా రాష్ట్ర ప్ర‌భుత్వం చూడాల‌ని కూడా కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.  

ప‌టాకులను కాల్చ‌కుండా అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిష‌న్ వేసిన వ్య‌క్తికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బాణాసంచా అమ్మ‌కాలు, వాడ‌కంపై నిషేధం విధిస్తూ ఇటీవ‌ల గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఢిల్లీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాయు కాలుష్యం త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో రెండు గంటల పాటు ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన ప‌టాకులు కాల్చుకునేందుకు ట్రిబ్యున‌ల్ అనుమ‌తి ఇచ్చింది. అయితే ఈ నిషేధం న‌వంబ‌ర్ 9 నుంచి న‌వంబ‌ర్ 20 వ‌ర‌కు వ‌ర్తిస్తుంది.  దివాళీ, ఛాత్‌, గురు ప్ర‌బ‌, క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల స‌మ‌యంలోనూ ఈ నియ‌మావ‌ళి పాటించాల్సి ఉంటుంది.