మంగళవారం 07 జూలై 2020
National - Jun 02, 2020 , 02:24:41

పత్తి మద్దతు ధర 275 పెంపు

పత్తి మద్దతు ధర 275 పెంపు

  • క్వింటాలు వరికి రూ.53, మక్కజొన్నకు రూ.70
  • రైతు రుణాల చెల్లింపు గడువు ఆగస్టు 31కి పొడిగింపు 
  • ఎంఎస్‌ఎంఈలకు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ
  • వీధి వ్యాపారులకు 10 వేల చొప్పున తక్షణ రుణాలు
  • కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు 

  న్యూఢిల్లీ, జూన్‌ 1: పత్తితోపాటు పలు పంటలకు కేంద్రం కొత్త మద్దతు ధరలను ప్రకటించింది. పొడవు రకం పత్తికి క్వింటాలుకు రూ.275, మధ్యస్థ రకం పత్తికి రూ.260, వరికి క్వింటాలుకు రూ.53 చొప్పున మద్దతు ధరలను పెంచింది. మోదీ 2.0 సర్కారు రెండో ఏడాదికి చేరిన తొలి రోజే సోమవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నది. 2020-21 పంటకాలానికి సంబంధించి 14 రకాల పంటలకు మద్దతు ధరలను పెంచింది. రూ.3 లక్షల లోపు వ్యవసాయ, అనుబంధ రుణాల చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. 

  ఎంఎస్‌ఎంఈలకు చేయూత

  సంక్షోభంలో కూరుకుపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రూ.20,000 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని వల్ల 2 లక్షల పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అలాగే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ద్వారా ఎంఎస్‌ఎంస్‌ఈలకు మరో రూ.50 వేల కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మధ్య తరహా పరిశ్రమల టర్నోవర్‌ గతంలో ప్రకటించిన రూ.వంద కోట్లు నుంచి రూ.250 కోట్లకు పెంచింది. వీధి వ్యాపారులకు తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున రుణాలు అందించాలని నిర్ణయించింది. నెలవాయిదాల చొప్పున ఏడాదిలో తిరిగి చెల్లించాలి.

  కరోనా అనంతరం మరో ప్రపంచం

  కరోనా అనంతరం ప్రపంచం వేరుగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. స్వస్థత, సాంత్వన కోసం ప్రపంచం వైద్య సిబ్బందివైపు చూస్తున్నదని, వారిపై దాడులు సహించరానిదన్నారు.  logo