మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 19:36:21

అయోధ్య‌లో మ‌సీదు నిర్మాణానికి ట్ర‌స్ట్ ఏర్పాటు

అయోధ్య‌లో మ‌సీదు నిర్మాణానికి ట్ర‌స్ట్ ఏర్పాటు

ల‌క్నో: అయోధ్య‌లో మ‌సీదుతోపాటు ఇత‌ర సౌక‌ర్యాల నిర్మాణం కోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు ఒక  ట్ర‌స్ట్ ఏర్పాటు చేసింది. 15 మంది స‌భ్యుల‌తో ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు బుధ‌వారం తెలిపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సున్నీ సెంట్ర‌ల్ వక్ఫ్ బోర్డు వ్య‌వ‌స్థాప‌క ట్ర‌స్టీగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, సున్నీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జుఫర్ అహ్మద్ ఫరూకి ట్రస్ట్ అధ్యక్షుడిగా, అథర్ హుస్సేన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అయోధ్య‌లో కేటాయించిన భూమిలో మ‌సీదుతోపాటు ఇత‌ర నిర్మాణాల‌ను ఈ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో చేప‌డ‌తామ‌ని పేర్కొంది. 

అయోధ్య‌లోని వివాద‌స్ప‌ద రామ‌జ‌న్మ‌భూమి శ్రీరాముడికే చెందుతుంద‌ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం గ‌త ఏడాది న‌వంబ‌ర్ 9న చారిత్ర‌క తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం కోసం ఒక ట్ర‌స్టును ఏర్పాటు చేయాల‌ని కేంద్రానికి సూచించింది. అలాగే మ‌సీదు నిర్మాణం కోసం సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు అయోధ్య ప‌రిధిలోనే ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని ప్ర‌భుత్వం కేటాయించాల‌ని పేర్కొంది. 

ఈ నేప‌థ్యంలో అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమి స్థ‌లానికి 25 కిలోమీట‌ర్ల దూరంలో ల‌క్నో ర‌హ‌దారిలోని ఫైజాబాద్ స‌మీపంలో ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని యూపీ ప్ర‌భుత్వం కేటాయించింది. దీంతో అక్క‌డ మ‌సీదుతోపాటు ఇత‌ర నిర్మాణాల కోసం ఒక ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు సున్నీ వక్ఫ్ బోర్డు బుధ‌వారం తెలిపింది. అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఆగ‌స్టు 5న ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలో మ‌సీదు నిర్మాణం కోసం సున్నీ వ‌క్ప్ బోర్డు 15 మంది స‌భ్యుల‌తో ఒక ట్ర‌స్ట్ ఏర్పాటు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది.logo