శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 16:44:28

నక్సల్స్‌ ఏరివేతలో 8 నెలల గర్భిణి..

నక్సల్స్‌ ఏరివేతలో 8 నెలల గర్భిణి..

రాయ్‌పూర్‌ : గర్భిణిలను కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా చూసుకుంటారు. వారి పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటారు. బరువులు ఎత్తకుండా, ఆయాసం కలిగించే పనులు చేయించకుండా గర్భిణులకు విశ్రాంతి ఉండేలా చేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఓ గర్భిణి దండకారణ్యంలో విధులు నిర్వర్తిస్తుంది.

ఆమె ఎనిమిది నెలల గర్భిణి. అయినప్పటికీ దండకారణ్యంలో తుపాకీ చేతబట్టి.. భుజాన కిట్‌ బ్యాగ్‌లు వేసుకుని.. విశ్రాంతి లేకుండా నక్సల్స్‌ ఏరివేతలో నిమగ్నమైంది. 2019, మే నెలలో ఛత్తీస్‌గఢ్‌ పోలీసు విభాగం 30 మంది మహిళలతో యాంటీ నక్సల్స్‌ కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేసింది. నక్సల్స్‌ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టే చర్యల్లో భాగంగా ఏర్పాటైన ఈ బృందానికి దంతేశ్వరి లఢకే అని నామకరణం చేశారు. మావో ప్రభావిత ప్రాంతాలైన బస్తర్‌, దంతేవాడ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోలు విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ బృందంలోని సునైనా పటేలే.. ఎనిమిది నెలల గర్భిణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను మీడియా పలుకరించింది. తాను దంతేశ్వరి లఢకేలో చేరినప్పుడు రెండు నెలల గర్భవతిని అని సునైనా చెప్పారు. తానెప్పుడూ తన విధులను తిరస్కరించలేదు. ఇప్పుడు 8 నెలల గర్భిణిని అయినప్పటికీ తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నానని సునైనా చెప్పారు. 

ఆమెకు ఒకసారి గర్భస్రావం

దండకారణ్యంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఒకసారి సునైనాకు గర్భస్రావం జరిగిందని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ వెల్లడించారు. ఆ తర్వాత గర్భం ధరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. ఆమెను పలువురు మహిళలు ఆదర్శంగా తీసుకున్నారు. సునైనాను ఆదర్శంగా తీసుకుని పలువురు మహిళలు.. దంతేశ్వరి లఢకేలో చేరేందుకు ప్రేరణ పొందుతున్నారని ఎస్పీ పల్లవ్‌ తెలిపారు.


logo