ఆదివారం 31 మే 2020
National - May 20, 2020 , 01:20:38

వేడి తగ్గించిన సూరీడు

వేడి తగ్గించిన సూరీడు

  • సోలార్‌ మినిమమే కారణం
  • అందుకే తక్కువ ఉష్ణోగ్రతలు
  • ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి జరిగేదే

న్యూఢిల్లీ: భూమికి నిత్యం వెలుగును, వేడిని అందించే సూర్యుడు కూడా ఈ కరోనా సమయంలో లాక్‌డౌన్‌లో ఉన్నాడా.. అందుకే ఎండలు తక్కువగా ఉన్నాయా.. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతుండటంపై చాలా మంది వేస్తున్న జోక్‌ ఇది. జోక్‌ సంగతి ఎలా ఉన్నా.. సూర్యుడు నిజంగానే తన ప్రతాపాన్ని తగ్గించాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి ‘సోలార్‌ మినిమం’ కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. సూర్యుడి అయస్కాంత క్షేత్రాల బలాలు భానుడి ఉపరితల ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతాయి. ఈ అయస్కాంత క్షేత్రాలు ప్రతి 11 ఏండ్లకొకసారి తమ ఉత్తర దక్షిణ ధ్రువాలను క్రమంగా మార్చుకుంటాయి. దీనిని సోలార్‌ సైకిల్‌ అంటారు. సాధారణంగా సూర్యుడిలో జరిగే ప్రక్రియను సూర్యుడి ఉపరితలంపై ఏర్పడే మచ్చల(సన్‌స్పాట్స్‌) ద్వారా అంచనా వేస్తారు. అయితే సోలార్‌ సైకిల్‌ మధ్యలో ఉన్నప్పుడు ఈ సన్‌స్పాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. సోలార్‌ సైకిల్‌ ముగుస్తున్న సమయంలో సన్‌స్పాట్లు తక్కువవుతాయి. సన్‌స్పాట్లు తగ్గడం వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతాయి. దీనినే సోలార్‌ మినిమం అంటారు. 2014లో పోల్చితే ప్రస్తుతం సన్‌స్పాట్లు చాలా తగ్గినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు.

ఏమవుతుంది?

సోలార్‌ మినిమం వల్ల ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని, ఇది మరోసారి మంచుయుగానికి దారి తీస్తుందని, కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని కొంతమంది చెప్తున్నారు. అయితే వీటిని వాతావరణ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. భూఉష్ణోగ్రతలను సూర్యరశ్మితో పాటు అనేక కారకాలు ప్రభావితం చేస్తాయని, వాటిలో అగ్ని పర్వతాలు ముఖ్యమైనవని తెలిపారు. అయితే సన్‌స్పాట్స్‌ కారణంగా సౌర వ్యవస్థలోకి అధిక సంఖ్యలో కాస్మిక్‌ కిరణాలు చొచ్చుకెళ్తాయని, ఇవి వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. 


logo