సోమవారం 30 మార్చి 2020
National - Mar 06, 2020 , 02:59:15

దిక్సూచి.. కేరళ

దిక్సూచి.. కేరళ
  • కరోనా నియంత్రణలో దేశానికే ఆదర్శం
  • ముగ్గురు రోగులకు విజయవంతంగా చికిత్స
  • వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు

తిరువనంతపురం: కరోనా వైరస్‌పై కేరళ ప్రభుత్వం సాధించిన విజయం దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నది. భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసులు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్‌ నుంచి వచ్చిన ముగ్గురు వైద్యవిద్యార్థులకు వైరస్‌ సోకింది.కేరళ వైద్యులు వారికి చికిత్స అందించి కోలుకొనేలా చేశారు. ప్రస్తుతం వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో ఇప్పుడు దేశం మొత్తం కేరళ వైపు చూస్తున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 నియంత్రణకు తాము తీసుకున్న చర్యలను కేరళ వైద్యాధికారులు వివరించారు. అవి.. 

కేరళలో వైద్యారోగ్యశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న హెల్త్‌ వర్కర్ల వరకు బలమైన నెట్‌వర్క్‌ నిర్మించారు. 

కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ సోకిన లక్షణాలు ఏమాత్రం కనిపించినా దవాఖానకు తరలించారు. 

రోగులకు చికిత్స అందించేందుకు శిక్షణ పొందిన వైద్యసిబ్బందిని నియమించారు. పరిస్థితిపై ఉన్నతాధికారులు రోజువారీ సమీక్షిస్తున్నారు.  

 చికిత్స కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తున్నారు.

 రోగులకు ‘హెచ్‌1ఎన్‌1’ సహా శ్వాసకోస వ్యాధులకు సంబంధించిన అన్ని చికిత్సలు అందించారు. నిర్దేశిత స్థాయిలో యాంటీబయోటిక్స్‌, పోషకాహారం అందిస్తున్నారు.

 కేరళలో మంగళవారం నాటికి 23 మందిని దవాఖానల్లో ఉంచారు. 388 మందిని ఇండ్లకే పరిమితం చేశారు. 411 మంది అనుమానితులపై నిఘా ఉంచారు. 


28 రోజులు ఇండ్లల్లోనే.. 

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చినవారు, దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన కరోనా బాధితులు 14 రోజులపాటు ఇండ్లకే పరిమితం కావాలి. కానీ.. కేరళ ప్రభుత్వం దీనిని 28 రోజులపాటు అమలు చేస్తున్నది. వారిపై నిఘా ఉంచుతున్నది. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయేమోనని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నది. 


మానసికంగా.. సామాజికంగా అండ 

కరోనా బాధితులు మానసికంగా, సామాజికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. బాధితుల్లో ఒత్తిడి, అత్యుత్సాహం వంటి మానసిక సమస్యలున్న ట్టు గమనించారు. కరోనా అనుమానితులను, వారి కుటుంబాలను కలువడానికి, కనీసం వారు నివసించే వీధిలోకి వెళ్లడానికి కూడా స్థానికులు సాహసించడం లేదు. వారి వ్యాపారాలు కూడా నడవ డం లేదు. పాఠశాలల్లోనూ వెక్కిరింపులు తప్పడం లేదు. దీనిని నివారించేందుకు కేరళ ప్రభుత్వం ఎస్‌ఎంఎస్‌ల ద్వారా, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచా రం చేస్తున్నది. బాధితుల ఫోన్లకు స్ఫూర్తినిచ్చే సందేశాలు పంపుతున్నది. దవాఖానలో, గృహ నిర్బంధంలో ఉన్నవారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 215 మందిని ప్రత్యేకంగా నియమించింది. 


logo