శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 16:56:39

కరోనా సేవలకు విద్యార్థి కిడ్డీబ్యాంక్‌ డబ్బు విరాళం

కరోనా సేవలకు విద్యార్థి కిడ్డీబ్యాంక్‌ డబ్బు విరాళం

ఆమె ఇంజినీరింగ్ ఫైన‌లియ‌ర్ స్టూడెంట్‌. ప్యాకెట్ మ‌నీ కోస‌మే మ‌మ్మీ.. డాడీ ద‌గ్గ‌ర చేయి చాచే ద‌శ‌. కానీ ఆమె అంద‌రిలా కాదు. మ‌మ్మీ డాడీ ఇచ్చిన డ‌బ్బును ఎప్ప‌టిక‌ప్పుడు బ్యాంక్‌లో వేసుకుంది. అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టేది కాదు. ఇప్పుడు ఆమె అకౌంట్లో రూ. ల‌క్ష నిల్వ ఉన్నాయి. వీటితో మ‌న‌మైతే ఏం చేస్తాం?  పెద్ద దావ‌త్ చేసుకుంటాం. ఎలాగూ ఇప్పుడు క‌రోనా క‌ల‌క‌లం ఉంది కాబ‌ట్టి భ‌విష్య‌త్ అవ‌స‌రాలు ఎలా ఉన్నాయో అని దాచిపెట్టుకుంటాం. కానీ అమూల్య అనే ఇంజినీరింగ్ అమ్మాయి అలా చేయ‌లేదు. త‌న ద‌గ్గ‌ర ఉన్న ల‌క్ష రూపాయ‌ల‌ను కర్ణాట‌క సీఎం స‌హాయ‌నిధి ద్వారా క‌రోనా నియంత్ర‌ణ కోసం ఉప‌యోగించింది. ఒక చ‌దువుకునే అమ్మాయి క‌రోనా క‌ట్ట‌డికి విరాళంగా ల‌క్ష రూపాయ‌లు ఇవ్వ‌డం ప‌ట్ల సీఎం య‌డ్యూర‌ప్ప ఆనందం వ్య‌క్తం చేశారు. మ‌న కోసం మ‌న‌మే సాయం చేసుకోవాల్సిన స‌మ‌యం ఇది. అమూల్య‌ను ఆద‌ర్శంగా తీసుకొని ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. అముల్యా బెంగళూరులోని బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూట‌ర్ సైన్స్ ఫైన‌లియ‌ర్ చ‌దువుతోంది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఫైన‌లియ‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.

జూన్ లేదా జూలై తిరిగి ప్రారంభం అవుతుండొచ్చు. అయితే తొలుత ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ‌టం ప‌ట్ల చిరాకు ప‌డింది అమూల్య‌. కానీ త‌ర్వాత‌.. నిజంగానే ఇంత తీవ్రంగా ఉందా ప‌రిస్థితి అని విశ్లేషించుకున్న‌ది. ప్ర‌పంచం మొత్తం అట్టుడుకుతుంటే త‌మ ప‌రీక్ష‌లొక లెక్క‌నా అనుకున్న‌ది. ప‌నిలో ప‌నిగా పౌరులుగా మ‌నం కూడా ఏదైనా సాయం చేయాలి అనుకున్న‌ది. స‌మాజం నుంచి ఎంతో తీసుకున్నాం క‌దా? ఈ ఆప‌త్కాలంలో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనేది త‌న ఆలోచ‌న‌. ముందుగా త‌న అకౌంట్లో ఎంత డ‌బ్బుందో  చెక్ చేసుకున్న‌ది. రూ.ల‌క్ష ఉంద‌ని తెలుసుకొని ఆ ల‌క్ష రూపాయ‌ల‌తో ఉచితంగా శానిటైజ‌ర్స్‌.. గ్ల‌వ్స్‌.. మాస్క్‌లు పంపిణీ చేద్దాం అనుకుంది. కానీ ఎంత చేసినా కొద్ది మందికి మాత్ర‌మే ఉప‌యోగ ప‌డుతుంది అనుకొని  ఆ మొత్తాన్ని క‌రోనా విరాళంగా సీఎం స‌హాయ నిధికి అంద‌జేసింది. అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది.


logo