మంగళవారం 07 జూలై 2020
National - Jun 04, 2020 , 12:05:41

వ్యూహాత్మక సంబంధాలపై ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ

వ్యూహాత్మక సంబంధాలపై ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ

ఢిల్లీ  : కోవిడ్‌-19 నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన మంచి సమయం ఇదేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మెరిసన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొలిసారి ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రవాణా కోసం సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు ఒప్పందం చేసుకునే అవకాశాన్ని పరిశీలించారు. వాణిజ్య, రక్షణరంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపైన చర్చించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ఆస్ట్రేలియాతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలుచుకుందామని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థ త్వరగా బయటపడాలని ఆకాక్షించారు. ఈసంక్షోభ సమయాన్ని అవకాశంగా మలుచుకుందామన్నారు. భారత్‌, ఆస్ట్రేలియా పరస్పరం సహకారంతో ఎదుగుతాయన్నారు. 

మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక దుష్ప్రభావాలను అధిగమించడానికి ప్రధాని సమన్వయ సహకార విధానానికి పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు, మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇదే మంచి అవకాశమన్నారు. ఇది రెండు దేశాలకు మాత్రమే కాకుండా ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మొత్తానికి అదేవిధంగా ప్రపంచానికి కూడా ముఖ్యమైనదన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని భారత్‌ అవకాశంగా మలుచుకునేందుకు నిశ్చయించుకుందన్నారు. అన్ని రంగాల్లో దశలవారీగా సంస్కరణలకు తెరతీసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఫలితాలను మనం త్వరలోనే చూడొచ్చని ప్రధాని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ప్రధానిని భారత్‌ సందర్శనకు రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధాని మోదీ  ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడిన తర్వాత  కుటుంబ సమేతంగా భారత్‌ సందర్శనకు విచ్చే తమ ఆతిధ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరారు. ఇరు దేశాల ప్రధానులు గడిచిన ఏప్రిల్‌ 6వ తేదీన మొదటిసారిగా టెలిఫోన్‌లో సంభాషించుకున్నారు. నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు.


logo