మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 21:58:21

సివిల్స్ లో రాహుల్ మోదీకి 420 ర్యాంకు

సివిల్స్ లో రాహుల్ మోదీకి 420 ర్యాంకు

న్యూఢిల్లీ : సివిల్స్ 2019 ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ప్రదీప్ సింగ్ అగ్రస్థానంలో నిలువగా.. రెండో స్థానంలో జతిన్ కిషోర్, మూడో స్థానంలో ప్రతీభా వర్మ నిలిచారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. రాజకీయంగా బద్దవిరోధులుగా ఉన్న రాహుల్, మోదీ పేర్లను కలిపివున్న రాహుల్ మోదీకి 'చార్ సౌ బీస్' ర్యాంకు దక్కింది.

ఈ సంవత్సరం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ మొదలైన వివిధ పోస్టులకు మొత్తం 829 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రాథమిక పరీక్షల ఆధారంగా తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది భర్తీ చేయాల్సిన 927 ఖాళీలలో 180 ఖాళీలు ఐఏఎస్ క్యాడర్‌కు, ఐఎఫ్‌ఎస్ క్యాడర్‌కు 24, ఐపీఎస్ కేడర్‌కు 150, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ‘ఏ’ కి 438 ఖాళీలు, గ్రూప్ ‘బీ’ సేవలకు 135 ఖాళీలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో విచిత్రమైన యాదృచ్చికంగా రాహుల్ మోదీ అనే అభ్యర్థి 420 ర్యాంక్ సాధించారు. రాహుల్ మోదీ రోల్ నంబర్ 6312980. ఈ అభ్యర్థి పేరు భారత రాజకీయాల్లో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులైన ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీల కలయికగా ఉండటం విశేషం.

ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ మోదీ ర్యాంకు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు గమ్మత్తుగా పోస్టులు పెడుతున్నారు. 2020 లో 420 ర్యాంకు పొందడం మరో మహమ్మారి అని ఒకరు వ్యాఖ్యానించగా.. ఒకటి, రెండు స్థానాల్లో వచ్చినవారిని పట్టించుకోవడం లేదంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశాడు.


logo