గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 01:14:13

నేరుగా డబ్బు ఇవ్వండి

నేరుగా డబ్బు ఇవ్వండి

  •  గుజరాతీ షావుకారీ లెక్కలు చేయొద్దు
  • మోదీపై కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ, మే 16: ‘ఆత్మ నిర్భర్‌ అభియాన్‌' ప్యాకేజీ ద్వారా మోదీ సర్కార్‌ ఓవైపు ప్రజలకు అప్పులు ఇస్తూ.. మరోవైపు నగదు ఇస్తున్నట్టు నటిస్తున్నదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘(గుజరాతీ) షావుకారు లెక్కలొద్దు.. ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వండి’ అని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ శనివారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆత్మ నిర్భర్‌ అభియాన్‌' ప్యాకేజీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజలకు, దెబ్బతిన్న రంగాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ‘పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అప్పు ఇవ్వరు. వారి బాధను అర్ధం చేసుకొని సహాయం చేస్తారు. అదేవిధంగా భరతమాత తన పిల్లలకు ఇప్పుడు నేరుగా ధన సహాయం అందించాల్సిన అవసరం ఉన్నది’ అని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం తీసుకున్న చర్య చెడ్డదేం కాదు. అయితే ఇప్పుడు ఏది అత్యవసరమో గుర్తించాల్సింది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ‘కనీస నగదు బదిలీ పథకం’ (న్యాయ్‌)ని కేంద్రం తాత్కాలికంగానైనా అమలు చేయాలని రాహుల్‌ సూచించారు.  ఈ పథకం కింద దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఏటా సుమారు రూ.75వేలు నేరుగా నగదును బదిలీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. 


logo