బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 19:39:20

ఉత్తరప్రదేశ్‌లో మాయావతి విగ్రహాల ఏర్పాటు

ఉత్తరప్రదేశ్‌లో మాయావతి విగ్రహాల ఏర్పాటు

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతికి చెందిన విగ్రహాలను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. లక్నోలోని లాల్ బహుదూర్ శాస్త్రి మార్గంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ప్రేరణ కేంద్రంలో మూడు మాయావతి పాలరాతి విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రేరణ కేంద్రాన్ని మాయావతి నిర్మించారు. అయితే ఇందులో ఆమె విగ్రహాల ఏర్పాటు పనులు చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. బీఎస్పీ ప్రేరణ కేంద్రంలోని మూడు వైపులా ఏర్పాటు చేసిన మాయావతికి చెందిన మూడు పాలరాతి విగ్రహాలు ఇప్పడు బయటకు కనిపిస్తున్నాయి. లక్నోతోపాటు నోయిడాలోని పార్కుల్లో భారీ ఏనుగులు, విగ్రహాలను మాయావతి గతంలో ఏర్పాటు చేశారు.


కాగా కోట్లాది పార్టీ నిధులు ఖర్చు చేసి విగ్రహాలను ఏర్పాటు చేయడంపై విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ అంశంలో ఒక కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రజల కోరిక మేరకే విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు మాయావతి సమర్ధించుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. జీవించి ఉండగానే తన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడాన్ని పెద్ద ఘనతగా మాయావతి భావిస్తారు.

logo