గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 10:08:13

స్కూళ్ల రీఓపెనింగ్‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌.. కేంద్రం, రాష్ట్రాల భిన్నాభిప్రాయాలు

స్కూళ్ల రీఓపెనింగ్‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌.. కేంద్రం, రాష్ట్రాల భిన్నాభిప్రాయాలు

హైద‌రాబాద్‌: స్కూళ్లు ఎప్పుడు తెరుస్తార‌న్న‌దే ఇప్పుడు ఓ స‌మ‌స్య‌గా మారింది.  స్కూళ్ల రీఓపెనింగ్‌పై కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మార్చిలో స్కూళ్లు మూత‌ప‌డ్డాయి. అయితే సాధార‌ణంగా కొత్త విద్యాసంవ‌త్సరం  జూన్‌లో మొద‌ల‌వుతుంది. కానీ కోవిడ్ నేప‌థ్యంలో స్కూళ్ల ఓపెనింగ్ జ‌ర‌గ‌డం లేదు. దీనిపై కేంద్ర మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ‌శాఖ ఆయా రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు సేక‌రిస్తున్న‌ది.  ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలు మాత్రం ఆగ‌స్టులోనే స్కూళ్ల‌ను తెరువాల‌న్న ఉద్దేశంతో ఉన్నాయి. అయితే మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడుతో పాటు 21 రాష్ట్రాలు, యూటీలు మాత్రం స్కూళ్ల రీఓపెనింగ్‌పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, కేర‌ళ రాష్ట్రాలు సెప్టెంబ‌ర్‌లో బ‌డుల‌ను తెరువాల‌ని భావిస్తున్నాయి.  ఈ అంశంపై పేరెంట్స్ అభిప్రాయాలు తెలుసుకోవాల‌ని ఆయా రాష్ట్రాల‌కు కేంద్ర హెచ్ఆర్డీ శాఖ చెప్పింది. ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల్లో ఎప్పుడు ప్రారంభించాల‌న్న ఆప్ష‌న్ చెప్పాల‌ని హెచ్ఆర్డీ శాఖ కోరింది. 

దేశ‌వ్యాప్తంగా 25 కోట్ల మంది చిన్నారులు.. పాఠ‌శాల‌ల‌కు దూరం అయ్యారు.  కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పాఠాలు సాగుతున్నాయి. అయితే అస్సాం మాత్రం జూలై చివ‌రిలో స్కూళ్ల‌ను స్టార్ట్ చేయాల‌ని చూస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది.  స్కూళ్ల రీఓపెనింగ్‌కు సంబంధించిన గైడ్ లైన్స్ కావాలంటూ కొన్ని రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. స్కూళ్ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు హెచ్ఆర్డీ శాఖ ఆ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. ఆరోగ్య‌, హోంశాఖల నుంచి కూడా అనుమ‌తి రావాల్సి ఉన్న‌ది.

సెప్టెంబ‌ర్ 5న స్కూళ్లు తెర‌వాల‌ని ఏపీ భావిస్తున్న‌ది.  సెప్టెంబ‌ర్ ఒక‌టిన మ‌ణిపూర్ రాష్ట్రం స్కూళ్ల‌ను తెరిచేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ది. నాగాలాండ్‌లో సెప్టెంబ‌ర్ తొలి వారంలో బ‌డులు తెర‌వ‌నున్నారు. రాజ‌స్థాన్ కూడా సెప్టెంబ‌ర్‌కు మొగ్గు చూపింది. ఆగ‌స్టు 31 వ‌ర‌కు త‌మ స్కూళ్ల‌ను మూసివేసిన‌ట్లు ఒడిశా పేర్కొన్న‌ది. ఆగ‌స్టులో స్కూళ్లు తెరుస్తామ‌ని కేర‌ళ‌, ల‌డ‌ఖ్‌, క‌ర్నాట‌క చెప్పాయి. జూలై 20వ తేదీలోగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల‌ని కేంద్ర హెచ్ఆర్డీ శాఖ‌.. ఆయా రాష్ట్రాల‌ను కోరింది.
logo