ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 01:41:34

మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 4.0!

మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 4.0!

  • జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే..
  • లోకల్‌ రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులకు అనుమతి
  • విద్యాసంస్థలు, మాల్స్‌, థియేటర్లకు మాత్రం నో

న్యూఢిల్లీ, మే 15:  దేశవ్యాప్తంగా మూడో విడుత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా కంటైన్మెంట్‌యేతర జోన్లలో ఆంక్షలను మరింత సడలించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. మరికొన్ని రాష్ర్టాలు మాత్రం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో పలు కఠిన ఆంక్షల సడలింపుపై కేంద్రం మల్లగుల్లాలు పడుతున్నది. తమ రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు మిజోరం శుక్రవారం ప్రకటించింది. మరోవైపు, బీహార్‌ కూడా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రాన్ని కోరింది. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని ఏ రాష్ట్రం కూడా కోరలేదని, దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించాలని అన్ని రాష్ర్టాలు కోరినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. లాక్‌డౌన్‌ 4.0లో ఎక్కువ సడలింపులు, సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. గ్రీన్‌జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆరెంజ్‌ జోన్‌లో పరిమితస్థాయిలో ఆంక్షలు ఉంటాయని, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రమే కఠిన నిబంధనలు ఉండనున్నాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కొత్త నిబంధనలతో లాక్‌డౌన్‌ 4.0 పూర్తిగా భిన్నంగా ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించి శుక్రవారంలోగా అభిప్రాయాలు తెలుపాలని రాష్ర్టాలను కోరారు. 

రెడ్‌జోన్లలోనూ సడలింపులు..

తెలంగాణ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, అసోం రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. అయితే జోన్లను నిర్ణయించే అధికారం రాష్ర్టాలకు అప్పగించాలని కోరినట్లు చెప్పారు. ఈ విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పే అవకాశం ఉన్నదన్నారు. దేశంలో ఎక్కడా విద్యాసంస్థలు, మాల్స్‌, సినిమా హాళ్లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. అయితే కంటైన్మెంట్‌ ప్రాంతాలు మినహా రెడ్‌జోన్లలోనూ సెలూన్లు, బార్బర్‌ షాప్‌లు, ఆప్టికల్‌ దుకాణాలను తెరువనున్నట్లు చెప్పారు. రాష్ర్టాల సిఫారసులను పరిశీలించిన తరువాతనే తుది మార్గదర్శకాలను వెలువరించనున్నట్లు తెలిపారు. రైల్వే, దేశీయ విమాన రాకపోకలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌తోపాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు కూడా రైలు, విమాన సేవలను వ్యతిరేకించాయని తెలిపారు. దేశంలో కంటైన్మెంట్‌జోన్లు మినహా మిగతా ప్రాంతా ల్లో పరిమిత స్థాయిలో లోకల్‌ రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు నడవొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. పలు ఆంక్షలతో రెడ్‌జోన్లలోనూ ఆటో, ట్యాక్సీలను అనుమతి ఇవ్వొచ్చని తెలిపారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో మార్కెట్లను తెరిచే అధికారం రాష్ర్టాలకే అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. 

  • ముంబై, పుణే, సోలాపూర్‌, ఔరంగాబాద్‌, మాలేగావ్‌లలో కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగించాలని మహారాష్ట్ర సర్కార్‌ నిర్ణయించింది. మిగిలిన ప్రాంతాల్లో కేంద్ర మార్గదర్శకాలను అమలుచేయనున్నట్లు తెలిపింది.
  •   ప్రధాన పట్టణప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించాలని గుజరాత్‌ కోరుతున్నది. 
  • ఏపీ, ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ర్టాలు ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించాలని డిమాండ్‌చేస్తున్నాయి. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లోపారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలతోపాటు దేశీయ విమాన సర్వీసులు, మెట్రో రైలు సర్వీసులు, హోటళ్లును పునఃప్రారంభించాలని కేరళ విజ్ఞప్తి చేస్తున్నది. 
  •  బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ర్టాలు మాత్రం లాక్‌డౌన్‌ అమలుచేయాలని కోరుతున్నాయి. ఈ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వలసకూలీల రాకతో ఇవి మరింతే పెరిగే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు.వచ్చే కొన్ని నెలలపాటు రాష్ట్ర సరిహద్దులు తెరువొద్దని (వలస కూలీలు, అత్యవసరాలకు మినహా) ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ప్రధానిని కోరారు. 


logo