శనివారం 28 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 02:22:28

సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ: ఏదైనా రాష్ట్ర పరిధిలో సీబీఐ దర్యాప్తు నిర్వహించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేని పక్షంలో సీబీఐ దర్యాప్తు నిర్వహించలేదని తేల్చిచెప్పింది. రాజ్యాంగం మౌలిక స్వభావమైన సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగానే ఈ నిబంధనలు ఉన్నాయని జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇతర ప్రాంతాలకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ అధికారాలు, పరిధి విస్తరణ, దానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి వంటి అంశాలను పొందుపరిచిన ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీస్పీఈ) చట్టం 5, 6 సెక్షన్లను బెంచ్‌ ప్రస్తావించింది. సెక్షన్‌ 5 ప్రకారం డీఎస్పీఈ అధికారం, పరిధిని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు విస్తరించగలిగినా, అది సెక్షన్‌-6 ప్రకారం రాష్ర్టాల అనుమతి లేకపోతే సాధ్యం కాదని తెలిపింది. యూపీలో అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తు చెల్లుబాటును సవాల్‌ చేస్తూ నిందితులైన ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిర్ధారిస్తూ నిందితుల పిటిషన్లను కొట్టివేసింది. పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు ఇటీవల సీబీఐకి అనుమతిని ఉపసంహరించడం తెలిసిందే.