గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 04, 2020 , 09:26:55

బెంగాల్‌లో స్పుత్నిక్‌-వీ రెండో విడత ట్రయల్స్‌!

బెంగాల్‌లో స్పుత్నిక్‌-వీ రెండో విడత ట్రయల్స్‌!

కోల్‌కతా : అన్ని సక్రమంగా జరిగితే రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఈ నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వ కాలేజ్‌ ఆఫ్‌ మెడిస్‌, సాగోర్‌ దత్తా హాస్పిటల్‌లో ప్రారంభమవుతాయని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన సర్వేలు, మౌలిక సదుపాయాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వే ఫలితాల నివేదికను డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం కోసం పంపినట్లు సైట్‌ మేనేజర్‌ స్నేహెండు కోనర్‌ తెలిపారు. సైట్‌ను సందర్శించి, టీకాలు, ఇమ్యునోజెనిసిటీ నమూనాలను నిల్వ చేసేందుకు ఉన్న సౌకర్యాలు తనిఖీ చేసినట్లు చెప్పారు. హాస్పిటల్‌కు ఇంతకు ముందు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన అనుభవాలున్నాయని గుర్తించామని, పరిశోధనలు చాలా సంతృప్తికరంగా ఉండడంతో డీసీజీఐ ఆమోదం కోసం పంపామని, అనుమతి వస్తే ట్రయల్స్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)తో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌, పంపిణీకి ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా వంద మంది వలంటీర్లను ఎంపిక చేసి, 75 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. అలాగే మరో 25 మందికి ప్లేసిబో టీకా వేయనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.