న్యూఢిల్లీ, జూన్ 20: కరోనా మరో వేవ్‌ను నివారించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. వైద్య సదుపాయాలు పెంచాలని తెలిపింది. ఆందోళన కలిగించే స్థాయి ఉన్న (వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్) కరోనా రకాల వ్యాప్తిని గుర్తించినట్టు ఈ వారం మాల్దీవులు, మయన్మార్ కూడా తెలిపాయని, బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర దేశాలు ఇంతకుముందే నిర్ధారించాయని పేర్కొంది.
మన ప్రవర్తనను బట్టే కరోనా వేవ్‌లు
కరోనా వేవ్ ఏదైనా.. వైరస్ మ్యుటేషన్‌తో పాటు మానవ ప్రవర్తనపై కూడా ఆధారపడి ఉంటుందని ఎయిమ్స్ ప్రొఫెసర్ నీరజ్ నిశ్చల్ అన్నారు. వైరస్‌పై నిర్లక్ష్య వైఖరి మరో వేవ్‌కు కారణం అవుతుందని హెచ్చరించారు. ‘వైరస్ జన్యుక్రమం మార్చుకొంటూ వేగంగా వ్యాపిస్తున్నది. తగిన జాగ్రత్తలు తీసుకొంటే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. అదే సమయంలో వైరస్ జన్యుక్రమం మారకుండా అడ్డుకోవచ్చు. తద్వారా మరో వేవ్ రాకుండా నివారించవచ్చు’ అని ఆయన అన్నారు.