బుధవారం 08 జూలై 2020
National - Jun 02, 2020 , 02:24:28

ఈసారి మంచి వానలే!

ఈసారి మంచి వానలే!

  • కేరళ తీరాన్ని తాకిన నైరుతి
  •  ధ్రువీకరించిన ఐఎండీ 
  • జూన్‌ 8 వరకు రాష్ర్టానికి రుతుపవనాలు 

న్యూఢిల్లీ, జూన్‌ 1: దేశవ్యాప్తంగా ఈసారి సరిపడినన్ని వానలు పడనున్నాయి. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళ తీరాన్ని తాకాయని, దీంతో నాలుగు నెలలపాటు కొనసాగే వానాకాలం మొదలైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదుకానున్నదని తెలిపింది. అనుకున్న సమయానికి రెండు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్‌' శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటనపై ఐఎండీ డెరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర విబేధించారు. నైరుతి రుతుపవనాలు వచ్చాయని ధ్రువీకరించేందుకు అవసరమైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదని పేర్కొన్నారు. కాగా తాజాగా సోమవారం కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, మధ్య భారతం, తెలంగాణ రాష్ట్రమున్న దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే తూర్పు, ఈశాన్య భారతంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నదని వెల్లడించింది. మొత్తంగా వానాకాలంలో దేశవ్యాప్తంగా 102 శాతం సాధారణ వర్షపాతం (4 శాతం సవరణ.. అంటే అత్యల్పంగా 98 శాతం, అత్యధికంగా 106 శాతం వర్షపాతం) నమోదవుతుందని కేంద్ర భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి ఎం రాజీవన్‌ తెలిపారు. నాలుగు నెలల సగటు వర్షపాతం 88 సెంటీ మీటర్లుగా ఉంటుందని వెల్లడించారు. జూలైలో వర్షపాతం 103 శాతం, ఆగస్టులో వర్షపాతం 97 శాతంగా నమోదవుతుందని వివరించారు. దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 15 శాతం ఉన్నాయని, లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం 5 శాతంగా ఉన్నదని ఐఎండీ వెల్లడించింది. 

అల్ప పీడనం రక్షించింది

బంగాళఖాతంలో ఇటీవల ఏర్పడిన ‘అంఫాన్‌' తుఫాన్‌ కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని అనుకున్నప్పటికీ.. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం వల్ల పరిస్థితులు చక్కబడ్డాయని ఐఎండీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో అనుకున్న సమయానికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వెల్లడించారు. 

తెలంగాణలో సరిపడినన్ని వానలు 

తెలంగాణ రాష్ట్రంలోకి జూన్‌ 8 వరకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెడ్‌ నాగరత్న తెలిపారు. తెలంగాణలో ఈ వానాకాలంలో 102 శాతం (8 శాతం సవరణతో..అంటే అత్యల్పంగా 94శాతం, అత్యధికంగా 110 శాతం వర్షపాతం కురిసే అవకాశం) వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ప్రధానంగా వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. logo