శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 22:11:36

ఆగస్టు 5న కూతపెట్టనున్న తొలి ‘కార్గో ఎక్స్‌ప్రెస్‌’

ఆగస్టు 5న కూతపెట్టనున్న తొలి ‘కార్గో ఎక్స్‌ప్రెస్‌’

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ - న్యూఢిల్లీ మధ్య టైమ్‌ టేబుల్డ్‌ గూడ్స్‌ రైలు తొలి ‘కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సాధారణ సరుకు రవాణాలో రైల్వేల మార్కెట్‌ను పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ నుంచి న్యూఢిల్లీలోని ఆదర్శనగర్‌ వరకు ఆగస్టు 5న టైమ్‌ టేబుల్డ్‌ సరుకు రవాణా రైలును ప్రారంభిస్తున్నట్లు పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌సీఆర్‌) ఆరు నెలల పాటు పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని.. వారానికి ఒక రోజు చొప్పున ప్రతి బుధవారం సర్వీసును నడుపనుంది. సరుకు రవాణాతో అటు వినియోగదారులతో పాటు ఇటు రైల్వేలకు లాభదాయకంగా ఉండనుంది. రైల్వేలు రవాణా చేయడం ద్వారా సురక్షితం కావడంతో పాటు ఇతర వాటితో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి సరాసరి సరుకు రవాణా సుంకం, లోడు చేసే సరుకు రకాన్ని బట్టి టన్నుకు రూ.2,500గా ఉంటుంది. ఇది రోడ్డు ద్వారా వర్తించే ఛార్జీల కంటే 40 శాతం తక్కువగా ఉంది. 

సరుకు రవాణాలో సరికొత్త విధానాలు తీసుకువస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడూ ముందడుగు వేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, కార్గో మూవర్లు, చిన్న, మధ్యతరహా, మినీ ప్లాంట్ యజమానులకు ఇది ఎంతో లాభదాయకంగా ఉండనుందన్నారు. తక్కువ ధరతో కార్గోను రికార్డు సమయంలో తరలింవచ్చని, ఎంపిక చేసిన గమ్యస్థానాల స్టేషన్లు రెండూ ప్రధాన నగరాలు కావడంతో చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ఇది లాభదాయకంగా ఉంటుందని జీఎం తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo