సోమవారం 25 మే 2020
National - Apr 08, 2020 , 20:21:59

సోనియాజీ, ఆ సూచనను వెనుకకు తీసుకోండి

సోనియాజీ, ఆ సూచనను వెనుకకు తీసుకోండి

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ చేసిన ఒక సూచన పత్రికలకు మరణ శాసనం రాసేదిగా ఉంది. రెండేండ్లపాటు ప్రభుత్వంగానీ, పబ్లిక్‌రంగ సంస్థలు గానీ పత్రికలకు ప్రకకటనలు విడుదల చేయరాదనే ప్రతిపాదనను ఆమె ఉపసంహరించుకోవాలని భారతీయ వార్తా పత్రికల సంఘం (ఐఎన్ఎస్) బుధవారం ఒక ప్రకటనలో కోరింది. అది ఆర్థిక సెన్సార్‌షిప్ కిందకు వస్తుందని అభిప్రాయపడింది. కరోనా వైరస్‌పై పోరుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు చేపట్టాల్సిన ఐదురకాల పొదుపు చర్యలను ఆమె సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో తదితర మీడియాలకు జారీచేసే ప్రకటనలను రెండేండ్లపాటు నిలిపివేయాలనేది ఆ ఐదింటిలో ఒకటి. రేడియో ఆపరేటర్ల సంఘం, న్యూస్ బ్రాడ్‌కాస్టర్ల సంఘం మంగళవారమే ఆమె సూచనను ఖండిస్తూ ప్రకటనలు జారీచేయగా, ఐఎన్ఎస్ వాటికి మద్దతు తెలిపింది. ఒకరోజు ఆలస్యంగా సొంత ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వం జారీచేసే ప్రకటనల సొమ్ము ప్రభుత్వం మొత్తం వ్యయంలో ఎంతో ఉండదని, కానీ పత్రికల మనుగడకు మాత్రం అది ఎంతో పెద్దమొత్తమని ఐఎన్ఎస్ అందులో పేర్కొన్నది. చురుకైన ప్రజాస్వామ్యానికి పత్రికలు ఎంతో అవసరమని గుర్తు చేసింది. సర్కారు వేజ్‌బోర్డుల ద్వారా వేతనాలు నిర్ణయించే, మార్కెట్ శక్తులు వేతనాలు నిర్ణయించని ఏకైక రంగం ఇదేనని ఐఎన్ఎస్ తెలిపింది. ఈ పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉందని గుర్తుచేసింది. ఫేక్ న్యూస్, వక్రీకరణల ప్రస్తుత యుగంలో ప్రింట్ మీడియా ప్రభుత్వానికి, విపక్షాలకు ఉత్తమ వేదిక అని తెలిపింది. మాంద్యం వల్ల, డిజిటల్ మీడియా దాడుల వల్ల ప్రకటనలు, సర్కులేషన్ ఆదాయం ఇదివరకే తగ్గిపోయిందని, ఇక లాక్‌డౌన్ కారణంగా పత్రికలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయని వివరించింది. విశ్వమహమ్మారిపై ప్రాణాలొడ్డి మీడియా సిబ్బంది వార్తలు అందిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత చేసిన సూచన ఆందోళన కలిగిస్తున్నదని, ఆ సూచనను ఆమె ఉపసంహరించుకోవాలని ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది.


logo