శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 16:53:06

ఆ అప‌విత్ర కూట‌మిని ప్ర‌జ‌లు ఉపేక్షించ‌రు: ‌కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

ఆ అప‌విత్ర కూట‌మిని ప్ర‌జ‌లు ఉపేక్షించ‌రు: ‌కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ: జమ్ముక‌శ్మీర్‌లో కొత్తగా ఏర్పాటైన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌ (పీఏజీడీ)పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌ విషయంలో గుప్కార్ కూట‌మి బయటి శక్తుల జోక్యాన్ని కోరుతున్న‌ద‌ని ఆయన విమ‌ర్శించారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధ‌మైన‌ అలాంటి 'అపవిత్ర ఘట్‌బంధన్'ను ప్రజలు ఎంతోకాలం ఉపేక్షించరని హెచ్చరించారు. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని అవమానించిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా..? అని కాంగ్రెస్  అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీని అమిత్‌షా ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

'గుప్కార్ గ్యాంగు గ్లోబల్‌ తలుపులు తట్టాలనుకుంటోంది. జ‌మ్ముక‌శ్మీర్‌‌లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు. గుప్కార్ గ్యాంగు భారత త్రివర్ణ పతాకాన్ని కూడా అవమానిస్తున్న‌ది. గుప్కార్ గ్యాంగ్ చర్యలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మద్దతిస్తారా..? వారి వైఖరి ఏమిటో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి' అని అమిత్‌షా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్, గుప్కార్ గ్యాంగ్ తిరిగి జమ్ముక‌శ్మీర్‌ను ఉగ్రవాద భయాలు, కల్లోల శకంలోకి నెట్టివేయాలని అనుకుంటున్నట్టు అమిత్‌షా ఆరోపించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.