శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 10:54:53

కాంగ్రెస్‌ నాయకత్వంపై ఏప్రిల్‌లో నిర్ణయం?

కాంగ్రెస్‌ నాయకత్వంపై ఏప్రిల్‌లో నిర్ణయం?

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్‌ నాయకత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్తిస్థాయిలో అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. మరి సోనియానే పార్టీ అధ్యక్షురాలిగా ఉంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

ఇక రాహుల్‌ గాంధీ ఈసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడిపించేందుకు చురుకైన అధ్యక్షుడు కావాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ 2015 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది. నాటి ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఈసారి 63 మంది డిపాజిట్లను కోల్పోయారు. 


logo