మంగళవారం 26 మే 2020
National - May 22, 2020 , 19:36:09

కేంద్ర ప్యాకేజీ ఒక క్రూరమైన జోక్‌: సోనియాగాంధీ

కేంద్ర ప్యాకేజీ ఒక క్రూరమైన జోక్‌: సోనియాగాంధీ

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిపక్ష పార్టీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మార్చి 24న లాక్‌డౌన్ ప్రకటన నుంచి, మే 15న ఆర్థిక ప్యాకేజీ ప్రకటన వరకు కేంద్రం మొత్తం దుందుడుకు చర్యలే అవలంభించిందని ఆమె మండిపడ్డారు. మార్చిన 24న ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఏకపక్షంగా కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారని, అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని సోనియా గుర్తుచేశారు.

21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నామని, ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయని సోనియాగాంధీ పేర్కొన్నారు. ప్రభుత్వం 4 లాక్‌డౌన్‌లు అమలు చేసిన కరోనా మహమ్మారి నుంచి బయటపడకపోగా, ఈ లాక్‌డౌన్‌లు తీవ్ర దుష్ఫలితాలు ఇస్తున్నాయని ఆమె ఆరోపించారు.

కరోనా టెస్టుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోనియాగాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక క్రూయల్ జోక్‌గా నిలిచిందని సోనియా వ్యంగ్యాస్త్రం సంధించారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా వలసకూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక దేశంలోని 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు. 


logo