గురువారం 28 మే 2020
National - May 16, 2020 , 12:28:33

మేము రాము బిడ్డో ఈ ముంబై నగరానికి..

మేము రాము బిడ్డో ఈ ముంబై నగరానికి..

ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే‌స్టేషన్ వద్ద వేలాదిమంది వలస కార్మికులు నాలుగు లైన్లలో కనుచూపు మేర బారులు తీరి నిల్చున్నారు. శర్కారు నడుపుతున్న శ్రామిక్ రైళ్లు తమను ఇంటికి చేరుస్తాయనే ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ముంబైతోపాటుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐదు లక్షల మందికిపైగా సొంతూళ్లకు వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వారిని కదిలిస్తే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంది. 'ఇక్కడ పడ్డ బాధలు చాలు బాబూ.. మళ్లీ ఇటువేపు రాము. ఈ మహానగరంలో మావి దిక్కులేని బతుకులయ్యాయి. ప్రభుత్వం మా కష్టాలను తీర్చేందుకు ఏమీ చేయలేదు. కలోగంజో తాగి ఊళ్లోనే ఉంటాం' అని ఓ వలస కార్మికుడు చెప్పాడు. అయితే కష్టాలు అందరూ పడ్డారు. కానీ అందరూ ఇక రాము బాబూ అనడం లేదు. 'నగరంలో అంతా సర్దుకున్నాక మళ్లీ వస్తాం.. కరోనా కష్టకాలంలో నగరం మమ్మల్ని ఆదుకునేందుకు ఏమీ చేయని మాట నిజమే. కానీ పని దొరకాలంటే ఇక్కడే. అన్నీ సవ్యంగా ఉంటే ఇంతకు మించిన నగరం మరొకటి లేదు' అని మరో కార్ముకుడు అన్నాడు. లాక్‌డౌన్‌తో ఉన్నచోట ఇరుకున పడిపోయి వలస కార్మికులు పడిన యాతనలు ఇన్నీఅన్నీ కావు. ఉండలేక కొందరు ప్రయాణ సాధనాలు లేకపోవడంతో కాలినడకన బయలుదేరి నరకం అనుభవించారు. కేంద్రం ఎట్టకేలకు సమస్య తీవ్రత గుర్తించి శ్రామిక్ రైళ్లను ప్రారంభించింది. పదిలక్షల మందికిపైగా కార్మికులు రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది.


logo