ఆదివారం 17 జనవరి 2021
National - Dec 26, 2020 , 14:46:05

ప్ర‌జాస్వామ్యం గురించి నాకే నేర్పుతారా : ప్ర‌ధాని మోదీ

ప్ర‌జాస్వామ్యం గురించి నాకే నేర్పుతారా :  ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌ల కోసం ఇవాళ ప్ర‌ధాని మోదీ సేహ‌త్ స్కీమ్‌ను ప్రారంభించారు.  వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. క‌శ్మీర్‌లో ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌జ‌లు ఓటేశార‌ని ఇటీవ‌ల జ‌రిగిన డీడీసీ ఎన్నిక‌ల‌ను ఉద్దేశిస్తూ మోదీ కామెంట్ చేశారు. గాంధీ సిద్ధాంత‌మైన గ్రామ స్వ‌రాజ్యానికి త‌గిన‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్ సాధించింద‌ని ప్ర‌ధాని అన్నారు.  ఆయుష్మాన్ భార‌త్ పీఎం-జేఏవై ఎస్ఈహెచ్ఏటీ స్కీమ్‌ను ప్రారంభించిన అనంత‌రం మాట్లాడుతూ.. గ‌తంలో క‌శ్మీర్‌లో కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్నామ‌ని, కానీ ఇప్పుడు ఆ కూట‌మి వీగిపోయింద‌న్నారు.  పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని, ప్ర‌జ‌ల‌కు వారివారి హ‌క్కుల్ని క‌ల్పించ‌డ‌మే తమ ఉద్దేశ‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు. పుదుచ్చ‌రిలో కూడా పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింద‌ని, కానీ అక్క‌డ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌న్నారు.  ప్ర‌జాస్వామ్యంపై త‌న‌కు పాఠాలు చెప్పేవాళ్లు.. ఆ రాష్ట్రంలో మాత్రం స్థానిక ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేక‌పోతున్న‌ట్లు మోదీ విమ‌ర్శించారు.  ఇటీవ‌ల రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ప్ర‌జాస్వామ్యం లేద‌ని విమ‌ర్శలు చేశారు.  రైతు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్న వారిని ప్ర‌భుత్వం ఉగ్ర‌వాదులు అంటూ ముద్ర వేస్తున్న‌ద‌ని, ఆర్ఎస్ఎస్ నేత‌ను కూడా ఉగ్ర‌వాది అంటూ మోదీ ఆరోపించినా ఆశ్చ‌ర్యం లేద‌ని రాహుల్ అన్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ.. త‌న ప్ర‌సంగంలో రాహుల్‌కు కౌంట‌ర్ ఇచ్చారు.