శనివారం 15 ఆగస్టు 2020
National - Mar 24, 2020 , 21:10:57

సోష‌ల్ డిస్టాన్సింగ్‌.. ప్రాణ‌ర‌క్ష‌ణ‌కు ఇదే మార్గం !

సోష‌ల్ డిస్టాన్సింగ్‌.. ప్రాణ‌ర‌క్ష‌ణ‌కు ఇదే మార్గం !

హైద‌రాబాద్‌:  ప్ర‌ధాని అయినా.. ప‌ల్లెటూరోడైనా.. ఒంటరిగా ఉండాల్సిందే. క‌రోనా వైర‌స్‌ను వ‌దిలించుకోవాలంటే ఈ నియమం త‌ప్ప‌దు.  ప్ర‌తి ఒక్క‌రికీ సోష‌ల్ డిస్టాన్సింగ్ వ‌ర్తిస్తుంద‌ని ఇవాళ ప్ర‌ధాని మోదీ త‌న ప్ర‌సంగంలో స్ప‌ష్టం చేశారు. త‌న‌కు కూడా ఈ నియమం వ‌ర్తిస్తుంద‌ని ఆయ‌న చాలా క్లారిటీతో వివ‌రించారు.  జ‌నం గుంపులు గుంపులుగా ఉండ‌కూడ‌దు.  ఇదే ఆ సోష‌ల్ డిస్టాన్సింగ్ ఉద్దేశం.  వైర‌స్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియ‌దు.  ఇంటికి ల‌క్ష్మ‌ణ రేఖ గీయాలి. ఆ రేఖ దాటితే.. మీ ఇంట్లోకి వైర‌స్ రావ‌డం ఖాయం అని ఆయ‌న అన్నారు.  ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌ల‌ను పెడ‌చ‌విని పెడితే.. మీ ఇంటికి మీరే ఆ భూతాన్ని తీసుకువ‌చ్చిన వార‌వుతారన్నారు. 

ఇదొక వ్య‌క్తితోనే ఆగిపోదు.. ఇంట్లో ఒక్క‌రికి వైర‌స్ సోకినా.. అది అంద‌రికీ వ్యాప్తిస్తుంది. అందుకే సోష‌ల్ డిస్టాన్సింగ్ మెయిన్‌టేయిన్ చేయాలి. కరోనాతో అత‌లాకుత‌లం అవుతున్న అన్ని దేశాలు ఇస్తున్న అమూల్య‌మైన సందేశం ఇదే.  ఎవ‌రు సోష‌ల్ డిస్టాన్స్ పాటిస్తారో.. అంటే ఓ వ్య‌క్తి మ‌రో వ్య‌క్తికి క‌నీస దూరాన్ని పాటిస్తాడో.. అప్పుడే ఆ వైర‌స్ ప్ర‌బ‌ల‌కుండా ఉండే ఛాన్సు ఉన్న‌ది.  సోష‌ల్ డిస్టాన్స్ సూత్రాన్ని ప‌ట్టించుకుపోవ‌డం వ‌ల్ల ఇరాన్‌, ఇట‌లీ దేశాలు.. వైర‌స్ వ‌ల‌యంలో క‌కావిక‌ల‌మ‌య్యాయి. కేవ‌లం వైర‌స్ సైకిల్‌ను బ్రేక్ చేసేందుకే ఈ ప్ర‌క్రియ అవ‌స‌రం. ఈ నియ‌మాన్ని అవ‌లంబిస్తేనే ఆ మ‌హ‌మ్మారి మ‌న‌ల్ని ద‌రిచేర‌దు. 

క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారి ప‌ట్ల సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించాలి. అత్య‌ధిక శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు, విప‌రీత‌మైన ద‌గ్గు ఉన్న‌వారిని కొంత దూరంగా పెట్ట‌డం ఉత్త‌మం. అవ‌స‌రం లేన‌ప్పుడు ఎటువంటి ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను వాడ‌కుండా ఉండండి. వీలైనంత వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయాలి. మీ సంస్థ దీనికి స‌హ‌క‌రిస్తుంది. ప‌బ్లిక్ ఏరియాల్లో జ‌న సమీక‌ర‌ణ‌ను క‌ట్ట‌డి చేయాలి. ఇప్ప‌టికే ప‌బ్‌లు, రెస్టారెంట్లు, హోట‌ళ్లు, ఆల‌యాలు, మాల్స్‌ను మూసివేశారు.  ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో కూడా అవ‌స‌ర‌మైన మేర‌కు మాత్రమే కాంటాక్ట్‌లో ఉండాలి. ఫోన్‌, ఇంటర్నెట్‌, సోష‌ల్ మీడియాతో వారితో ట‌చ్‌లో ఉండండి.  కొన్ని వారాల పాటు ఈ నియ‌మం పాటిస్తే, అది అంద‌రికీ క్షేమ‌క‌రం.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్నస‌ల‌హా కూడా ఇదే. 21 రోజుల త‌ర్వాత సోష‌ల్ డిస్టాన్సింగ్ ఫ‌లాల‌ను స్వీక‌రిద్దాం.logo