శనివారం 16 జనవరి 2021
National - Nov 30, 2020 , 19:29:45

సామాజిక కార్య‌క‌ర్త షీత‌ల్ ఆమ్టే ఆత్మ‌హ‌త్య‌

సామాజిక కార్య‌క‌ర్త షీత‌ల్ ఆమ్టే ఆత్మ‌హ‌త్య‌

ముంబై:  డాక్ట‌ర్ బాబా ఆమ్టే మ‌న‌వ‌రాలు, సామాజిక కార్య‌క‌ర్త షీత‌ల్ ఆమ్టే సోమ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని చంద్ర‌పూర్‌లో ఉన్న త‌న ఇంట్లో ఆమె విషం తాగి సూసైడ్ చేసుకున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆమెను వెంట‌నే వ‌రోరా ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లినా.. అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. గ‌త కొంత కాలంగా ఆమ్టే కుటుంబంలో ఓ వివాదం న‌డుస్తోంది. ఇదే కాకుండా షీత‌ల్ డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్లు కూడా తెలిసింది. చంద్ర‌పూర్‌లోని ఆనంద్‌వ‌న్‌లో  ఉన్న మ‌హారోగి సేవా స‌మితికి షీత‌ల్ సీఈవోగా ఉన్నారు. ఆమె ఈ మ‌ధ్యే ఈ సంస్థ ట్ర‌స్టీలు, కుష్టు సేవా క‌మిటీ కార్య‌క‌ర్త‌ల‌పై ఫేస్‌బుక్ ద్వారా ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఆ లైవ్ వీడియోను ఆమె ప్రొఫైల్ నుంచి వెంట‌నే తొల‌గించిన ఆమ్టే కుటుంబ స‌భ్యులు.. షీతల్ డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. మ‌హారోగి సేవా స‌మితి, ట్ర‌స్టీలు, ఉద్యోగుల‌పై ఆమె చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్ద‌ని ఆమ్టే కుటుంబం నవంబ‌ర్ 22న ఒక సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. షీత‌ల్ ఆమ్టే గ‌త కొన్నేళ్లుగా త‌న భ‌ర్త‌తో క‌లిసి కుష్టు రోగుల‌కు సేవ‌లు అందిస్తున్నారు. ఆమ్టే కుటుంబం మూడు త‌రాలు సామాజిక సేవ‌లో పాలుపంచుకుంటోంది.