ఆదివారం 29 మార్చి 2020
National - Feb 24, 2020 , 02:06:25

మౌర్యలో రాజభోగం

మౌర్యలో రాజభోగం
  • సకల వసతుల ‘చాణక్య’
  • ఐటీసీ మౌర్యలో ట్రంప్‌ బస

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రాజభోగాలతో ఆతిథ్యం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని హోటల్‌ ఐటీసీ మౌర్యలో ఆయన బస చేయనున్న గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ‘చాణక్య’లో ఇప్పటికే సకల వసతులు కల్పించారు. విస్తృత భద్రతా వ్యవస్థలతోపాటు ఆహారాన్ని పరీక్షించేందుకు మైక్రోబయాలజికల్‌ ల్యాబోరేటరీ.. ప్రైవేట్‌ డ్రాయింగ్‌ రూమ్‌, బట్లర్లతోపాటు స్పా తదితర వసతులు ఇందులో ఉన్నాయి. అతిథులకు స్వచ్ఛమైన వాయువు అందుబాటులో ఉండేలా వాయు నాణ్యతా నియంత్రణ వ్యవస్థ ఏర్పాటైంది. ప్రైవేట్‌ డ్రాయింగ్‌ రూమ్‌, ప్రైవేట్‌ టెర్రస్‌, జిమ్‌, ప్రైవేట్‌ ఎంట్రన్‌తో కూడిన డైనింగ్‌ ఏరియా, హై స్పీడ్‌ ఎలివేటర్‌, సిల్క్‌ పానెళ్లు గల వాల్స్‌, డార్క్‌ వుడ్‌ ఫ్లోరింగ్‌, అద్భుతమైన కళాఖండాలతో ఈ డబుల్‌ బెడ్‌రూమ్‌ను అలంకరించారు. ఇంకా ప్రెసిడెన్షియల్‌ ఫ్లోర్‌ బట్లర్‌ కూడా ఉంటారు. తనను కలుసుకోవడానికి విచ్చేసే ఆహుతులకు విందునిచ్చేందుకు రిసెప్షన్‌ ఏరియా, పొడవైన లివింగ్‌ రూమ్‌, నెమలి థీమ్‌తోపాటు 12 మంది కూర్చునేందుకు వీలుగా ప్రైవేట్‌ డైనింగ్‌ రూమ్‌, సుసంపన్న బాత్‌రూమ్‌, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 55 అంగుళాల హెచ్‌డీ టీవీలు, ఐపాడ్‌ డాకింగ్‌ స్టేషన్‌ తదితర వసతులు కూడా ఈ ‘చాణక్య’ సూట్‌ సొంతం. గత రెండు వారాలుగా భద్రతా బలగాల నిఘాలో మగ్గుతున్న ఈ హోటల్‌లోని మిగతా గదులు కూడా ట్రంప్‌ ప్రతినిధి బృందానికే కేటాయించారు. ఐదంతస్తుల ఈ హోటల్‌ అంతా మూడంచెల భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఈ హోటల్‌లోని 438 గదుల్లోనూ పౌర దుస్తులు ధరించిన పోలీసులు విధులు నిర్వర్తిస్తారని ఓ అధికారి తెలిపారు. రెండు బెడ్‌రూమ్‌లతో కూడిన ఈ సూట్‌లో ఇంతకుముందు అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్‌, బిల్‌ క్లింటన్‌, జార్జి డబ్ల్యూ బుష్‌, బరాక్‌ ఒబామాలతోపాటు పలు దేశాల అధినేతలు బస చేశారు. 

సంప్రదాయ స్వాగతం 

భారత పర్యటనకు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మొదటి మహిళా మెలానియా ట్రంప్‌కు దేశ సంప్రదాయ స్వాగతం లభించనున్నది. సోమవారం రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకొనే ట్రంప్‌ దంపతులకు పూర్తి సంప్రదాయ టీకా దండలతో సిబ్బంది ఆహ్వానం పలుకుతారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో సంప్రదాయంగా నమస్తే చెప్పే పద్ధతిలో చేతులుజోడించి విలక్షణమైన లోగో ద్వారా ‘నమస్తే ట్రంప్‌' అని అన్నివైపుల నుంచి స్వాగతం పలుకనున్నారు. హోటల్‌ మొత్తం ‘నమస్తే’ నామస్మరణ చేయనున్నది. 


logo