మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 15:19:06

వచ్చే ఐదేళ్లలో దేశంలో భారీస్థాయిలో స్మార్ట్‌ఫోన్లు, విడిభాగాల తయారీ: మంత్రి రవిశంకర్‌ ప్రసాద్

వచ్చే ఐదేళ్లలో దేశంలో భారీస్థాయిలో స్మార్ట్‌ఫోన్లు, విడిభాగాల తయారీ: మంత్రి రవిశంకర్‌ ప్రసాద్

న్యూ ఢిల్లీ: ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) కింద దేశంలో రాబోయే ఐదేళ్లలో రూ 11.5 లక్షల కోట్ల  విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు తయారు చేస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీఎల్‌ఐ పథకం కింద 22 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. 

‘ఈ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో రూ .11.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, విడిభాగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో 7 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తాం.’ అని రవిశంకర్‌ప్రసాద్‌ స్పష్టంచేశారు. అలాగే, ఈ కంపెనీలు మూడు లక్షల ప్రత్యక్ష, తొమ్మిది లక్షల పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకం ఏ దేశానికీ వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. తాను ఏ దేశం పేరును తీయదల్చుకోలేదన్నారు. ఎందుకంటే  మన భద్రత, సరిహద్దు దేశాలకు సంబంధించి సరైన నియమ నిబంధనలు వచ్చాయని, వాటికి కట్టుబడి ఉందామన్నారు. ఈ పీఎల్‌ఐ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్‌  లక్ష్యాన్ని నెరవేరుస్తుందని తాను భావిస్తున్నట్లు రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo