సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 01:50:57

చిన్నమొత్తం..పెద్ద మోసం

చిన్నమొత్తం..పెద్ద మోసం

 • లాక్‌డౌన్‌లో సరికొత్త సైబర్‌ మోసాలు
 • ఖాతానుంచి రూపాయి నుంచి వెయ్యిలోపే మాయం
 • ట్రెండింగ్‌గా గూగుల్‌ ప్రాక్సిమా బీటా మోసం
 • జాగ్రత్తలతో బయటపడొచ్చంటున్న పోలీసులు 
 • వందలే కదాని వదలొద్దంటూ సూచన

ఒక్క రూపాయి.. రూ.79.. రూ.799.. రూ.800.. బ్యాంకు ఖాతాలనుంచి సైబర్‌ నేరగాళ్లు కొట్టేస్తున్న డబ్బులివి.. చిన్న మొత్తాలుగానే ఇవి కనిపించొచ్చు కానీ.. రోజుకు ఎన్నిసార్లు.. ఎంతమంది ఖాతాలనుంచి మాయమవుతున్నాయో లెక్కిస్తే అది లక్షల్లోకి చేరుతున్నది. ఏ చిన్న అవకాశం ఉన్నా ఆన్‌లైన్‌లో మన ఖాతా ఖాళీ చేసేందుకు కేటుగాళ్లు గూగుల్‌ ప్రొక్సిమా బీటా మోసాలకు తెరతీశారు. చిన్న మొత్తాల ఖాళీచేస్తూ పెద్ద మోసాలకు పాల్పడుతున్నారు. వందలేకదాని ఎట్టి పరిస్థితిల్లో వదలొద్దని.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏ లావాదేవీలు జరిపినా ఓటీపీ వస్తుంది. చాలాసార్లు ఓటీపీ రాకుండా సైబర్‌ నేరగాళ్లు చిన్నమొత్తాలను టార్గెట్‌ చేసుకుంటున్నారని సైబర్‌ క్రైం పోలీసులు చెప్తున్నారు. మనకు తెలియకుండానే చిన్న మొత్తాలు ఎన్నోసార్లు ఇతర ఖాతాల్లోకి వెళ్తున్నాయి. దీన్నే గూగుల్‌ ప్రాక్సిమా బీటా మోసం అంటారు. కొన్నిసార్లు రూ.3900, రూ.7900 కట్‌ అవుతున్నాయి. డబ్బు కట్‌ అయినట్టు వచ్చే మెసేజ్‌లో గూగుల్‌ అనే పదం ఉంటుంది. డబ్బు కట్‌ అయిందని బ్యాంకులకు వెళ్తే.. అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి దేశాల నుంచి ఈ లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు సిబ్బంది చెప్తున్నారు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ లావాదేవీలు చేసుకునేటప్పుడు మన డెబిట్‌ లేదా క్రెడిట్‌కార్డు నంబర్‌, గడువు, కార్డు వెనుక ఉన్న సీవీవీ నంబర్‌ ఆధారంగా సైబర్‌ మోసాలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఏవైనా లావాదేవీలు జరిపితే ఓటీపీ రాదు. ఇప్పటికే వివిధ రూపాల్లో మన వివరాలు హ్యాక్‌చేసిన సైబర్‌ నేరగాళ్లు.. విదేశాలు కేంద్రంగా మన ఖాతాలనుంచి తక్కువ మొత్తాలు ఎక్కువసార్లు కొట్టేస్తున్నారని సైబర్‌ క్రైం నిపుణులు చెప్తున్నారు.

ఎక్కువగా ఈ బ్యాంకుల నుంచే

హెచ్‌డీఎఫ్‌సీ, రత్నాకర్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఫిర్యాదులను బట్టి తెలుస్తున్నదని, ఈ బ్యాంకుల ఖాతాదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. కొందరు ఫోన్లలో గూగు ల్‌ ప్లేస్టోర్‌ నుంచి పబ్జీ, లూడో, వీచాట్‌, జూక్స్‌, పిటు, క్యూక్యూతోపాటు ఇతర గేమింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఇవన్నీ సింగపూర్‌కు చెందిన టెన్‌సెంట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అభివృద్ధి చేసినవే. వీటిని డౌన్‌లోడ్‌ చేయడం ద్వారా కూడా డబ్బు కట్‌ అయ్యే ప్రమాదం ఉన్నదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

పోయిన డబ్బు పొందవచ్చు

 • బ్యాంక్‌నుంచి చిన్న మొత్తాలు కట్‌ అయినట్టు మెసేజ్‌లు వచ్చి దానిలో ‘గూగుల్‌' అని ఉంటే వెంటనే కార్డు బ్లాక్‌ చేయించాలి.
 • వీలైతే మీ ఖాతాలో ఉన్న మిగతా సొమ్మును వేరే ఖాతాలోకి బదిలీ చేయండి.
 • ‘https://pay.google.com/pay ments/unauthorizedtransactions’ లింక్‌పై క్లిక్‌చేస్తే ఫిర్యాదు చేయాలి. అందులోని ఫాంలో వివరాలు నింపితే పోయిన డబ్బు 12 రోజులలోపు ఖాతాలోకి వచ్చే అవకాశం ఉన్నది.
 • www.cybercrime.gov.in లో రిపోర్ట్‌ చేసి అనధికారిక లావాదేవీలకు సంబంధించి రుజువులు జతచేయాల్సి ఉంటుంది.
 • లావాదేవీలు జరిగిన మూడ్రోజుల్లోపు బ్యాంకును సంప్రదించాలి.

జాగ్రత్తలు పాటించాలి

 • డెబిట్‌, క్రెడిట్‌కార్డు తీసుకున్నప్పుడు అందులో అంతర్జాతీయ లావాదేవీల ఆప్షన్‌ను డిసేబుల్‌ చేయండి. అవసరమైనప్పుడు మళ్లీ ఎనేబుల్‌ చేయండి.
 • బ్యాంకు ఖాతా, కార్డు వివరాలు గూగుల్‌ ప్లేస్టోర్‌కు జతచేసి ఉంటే తొలగించండి
 • బహిరంగ ప్రదేశాల్లోని వైఫైని బ్యాంకు లావాదేవీలకు వినియోగించవద్దు. 
 • ఏ అప్లికేషన్స్‌ అయినా అనధికారిక వెబ్‌సైట్లనుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. 
 • ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఒక ప్రత్యేక ఖాతా పెట్టుకుని దానిలో తక్కువ డబ్బు ఉండేలా చూసుకోవాలి.


logo