గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 18:43:03

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సింగ‌పూర్ ప్ర‌ధాని!

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సింగ‌పూర్ ప్ర‌ధాని!

న్యూఢిల్లీ: సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు, కొవిడ్-19 సంక్షోభం లాంటి ప‌రిణామాల నేపథ్యంలో సింగ‌పూర్ ప్ర‌ధాని తాజా నిర్ణ‌యం తీసుకున్నారు. కరోనా కారణంగా సింగపూర్ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంద‌ని, ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు కొత్త ప్రభుత్వానికి ఐదేళ్ల కాలవ్యవధి అవ‌స‌ర‌మ‌ని, అందుకే తాము ముంద‌స్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామ‌ని ప్రధాని లీ పేర్కొన్నారు. 

ప్రస్తుత పార్లమెంటును రద్దుచేసి, ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు చెప్పినట్టు సింగ‌పూర్ ప్ర‌ధాని లీ తెలిపారు. మంగ‌ళ‌వారం టీవీ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన లీ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, దీనికి సంబంధించిన జాతీయ అజెండాపై దృష్టి పెట్టేందుకు ప్ర‌భుత్వానికి ఐదేండ్ల వ్య‌వ‌ధి అవ‌స‌ర‌మ‌ని లీ లూంగ్‌ పేర్కొన్నారు. 

సింగపూర్‌లో 2021 ఏప్రిల్‌లోగా ఎన్నికలు జ‌రుగాల్సి ఉంది. లీ నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ కూడా ఉంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపై లీ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, హాంకాంగ్ సమస్య, ఈ ఏడాది చివర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు, భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌ని, ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే దేశం ఏక‌తాటిపై నిలబడాలని లీ లూంగ్ అభిప్రాయ‌ప‌డ్డారు. 


logo