సిక్కు గురువు ఆత్మహత్య

- తుపాకీతో కాల్చుకున్న 65 ఏండ్ల సంత్ రామ్‌సింగ్
- రైతుల కష్టాలను చూసి తట్టుకోలేకపోతున్నానని లేఖ
- రైతుల నిరసనోద్యమం సాగుతున్న సింఘు వద్దే ఘటన
- ప్రతిష్టంభనపై కమిటీ వేస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: రైతులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై తన ఆగ్రహాన్ని, బాధను తెలియజేయడానికి సంత్ రామ్‌సింగ్ (65) అనే సిక్కు మత గురువు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరోవైపు, రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలు ఫలించేట్టు కనిపించట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రతిష్టంభనను తొలిగించేందుకు ఒక కమిటీ వేస్తామన్నది.
అన్యాయం చేయడం పాపం
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనోద్యమం చేస్తున్న రైతుల కష్టాలను చూసి తట్టుకోలేని సంత్ రామ్‌సింగ్ అనే సిక్కు మత గురువు బుధవారం సింఘుకు సమీపంలో తన కారులో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. పంజాబీ భాషలో ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో రైతులు పడుతున్న కష్టాలు చూసి ఎంతో బాధ కలుగుతున్నది. ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదు. అన్యాయం చేయడం పాపం. అన్యాయాన్ని సహించడం కూడా పాపమే. రైతులకు మద్దతుగా కొందరు తమ అవార్డులను ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. నేను ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నా’ అని సూసైడ్ నోట్లో రాశారు. ఆయనను వెంటనే దవాఖానకు తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. రామ్‌సింగ్ హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందినవారు. రామ్‌సింగ్ ఆత్మహత్యపై ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మన్జిందర్ సింగ్ సిర్సా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం చర్చలు ఫలించేట్టు లేవు
రైతుల ఉద్యమం త్వరలోనే ‘జాతీయ సమస్య’గా పరిణమించే అవకాశం ఉన్నదని, సంప్రదింపుల ద్వారా సత్వరమే సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేంద్రం జరుపుతున్న చర్చలు ఫలించేట్టు కనిపించట్లేదని, ప్రతిష్టంభనను తొలిగించేందుకు ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులతో తామే ఒక కమిటీని ఏర్పాటుచేయనున్నట్టు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్రంతోపాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. గురువారంలోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళన వల్ల సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రైతుల సమస్యకు ఆమోదయోగ్య పరిష్కారం చూపాలని కోరుతూ మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో గురువారంలోగా స్పందన తెలియజేయాలని రైతు సంఘాలకు కూడా నోటీసులు జారీచేసింది.
సమాంతర చర్చలు ఆపండి: రైతు నేతలు
వ్యవసాయ చట్టాలపై ఇతర రైతు సంఘాలతో ‘సమాంతర చర్చలు’ ఆపాలని 40 రైతు సంఘాల ఐక్యవేదిక బుధవారం కేంద్రానికి లేఖ రాసింది. తమ ఉద్యమాన్ని అప్రతిష్ఠపాలు చేసే చర్యలను మానుకోవాలని స్పష్టంచేసింది. ఇటీవల పలు రైతు సంఘాలతో సమావేశమైన కేంద్రం.. వ్యవసాయ చట్టాలకు వారు మద్దతునిచ్చినట్టు పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు, రైతుల అభ్యంతరాలకు త్వరలోనే ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రైతుల ఆందోళన ఒక్క రాష్ర్టానికే పరిమితమని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యానించారు.
రాష్ర్టాలు నోటిఫై చేయక్కర్లేదు: నిపుణులు
నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం నేపథ్యంలో ఆ చట్టాలను తాము నోటిఫై చేయబోమని పలు రాష్ర్టాలు ప్రకటించాయి. అయితే అవి ఇప్పటికే జాతీయ చట్టాలని, వాటిని రాష్ర్టాలు ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గెజిట్‌లో ఆ చట్టాలను ముద్రించారని, దేశమంతటికీ ఆ నోటిఫికేషన్ వర్తిస్తుందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ పేర్కొన్నారు.
రైతుల కష్టానికి సాంకేతిక సాయం
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, గురుద్వారా కమిటీలు అండగా నిలుస్తున్నాయి. గంటలో 1000-1200 చపాతీలు చేసే ఆటోమేటిక్ మెషిన్లు, వాషింగ్ మెషిన్లు, మొబైల్ చార్జింగ్తోపాటు, లైట్ల కోసం సోలార్ ప్యానెళ్లను సమకూర్చాయి. ఆ విధంగా సాంకేతికత రైతుల ఉద్యమానికి దన్నుగా నిలుస్తున్నది.
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం