మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 12, 2020 , 13:43:52

బ‌ల‌మైన వృద్ధి దిశ‌గా భార‌త్: కేంద్ర మంత్రి నిర్మ‌ల‌

బ‌ల‌మైన వృద్ధి దిశ‌గా భార‌త్: కేంద్ర మంత్రి నిర్మ‌ల‌

హైద‌రాబాద్‌:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.  ప్ర‌భుత్వం ఇస్తున్న ఉద్దీప‌న ప్యాకేజీల‌కు సంబంధించి ఆమె ప్ర‌క‌ట‌న చేశారు.  భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరంగా, బ‌లంగా కోలుకుంటోంద‌న్నారు. మూడ‌వ త్రైమాసికంలో వృద్ధి బ‌లంగా ఉంటుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు. అక్టోబ‌ర్‌లో పీఎంఐ 58.9గా ఉంద‌న్నారు. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్ష‌ల నుంచి 4.9 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ద‌న్నారు. క‌రోనా మ‌ర‌ణాల రేటు 1.47 శాతానికి ప‌డిపోయింద‌న్నారు. క్ర‌మంగా జీఎస్టీ వ‌సూళ్లు పెరుగుతున్నాయ‌ని, అక్టోబ‌ర్‌లో జీఎస్టీ వ‌సూళ్లు ల‌క్ష కోట్లు దాటిన‌ట్లు చెప్పారు.  సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి రేష‌న్ కార్డుల‌కు పోర్ట‌బులిటీ క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ చెప్పారు.  ఇంట‌ర్ స్టేట్ పోర్ట‌బులిటీ వ‌ల్ల సుమారు 68.6 కోట్ల మంది రేష‌న్ కార్డుదారుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. 28 రాష్ట్రాల్లో ఎఫ్‌పీఎస్ సౌల‌భ్యం అమ‌లులో ఉన్న‌ట్లు చెప్పారు.  రేష‌న్ కార్డు పోర్ట‌బులిటీ ద్వారా 1.5 కోట్ల లావాదేవీలు జ‌రుగుతున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 28 రాష్ట్రాల్లో వ‌న్ నేష‌న్‌, వ‌న్ రేష‌న్ కార్డు విధానం అమ‌లులో ఉంద‌న్నారు.  

వ‌ల‌స కూలీల‌కు పోర్ట‌ల్‌

వ‌ల‌స కూలీల డేటా కోసం కేంద్ర కార్మిక శాఖ‌, ఆర్థిక శాఖ‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ద‌ని, ఈ అంశంపై ఇత‌ర మంత్రిత్వ‌శాఖ‌లు కూడా అన్ని రాష్ట్రాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని,  వ‌ల‌స కూలీల కోసం ప్ర‌త్యేక పోర్ట‌ల్‌ను త‌యారు చేయ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ వెల్ల‌డించారు. నాబార్డ్ ద్వారా రైతుల‌కు 25వేల కోట్లు పంపిణీ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. 2.5 కోట్ల రైతుల‌కు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా క్రెడిట్ బూస్ట్ క‌ల్పించామ‌ని, రైతుల‌కు సుమారు 1.4 ల‌క్ష కోట్లు పంపిణీ చేశామ‌న్నారు.  ఎన్‌బీఎఫ్‌సీ-హెచ్ఎఫ్‌సీల‌కు స్పెష‌ల్ లిక్విడిటీ స్కీమ్ కింద 7227 కోట్లు మంజూరీ చేశామ‌న్నారు.  

ఎస్‌బీఐ ఉత్స‌వ్ కార్డులు..

ఫెస్టివ‌ల్ అడ్వాన్స్ స్కీమ్ కింద ఎస్‌బీఐ ఉత్స‌వ్ కార్డుల‌ను పంపిణీ చేసిన‌ట్లు మంత్రి సీతారామ‌న్ చెప్పారు.  అక్టోబ‌ర్ 12న ఫెస్టివ‌ల్ అడ్వాన్స్ స్కీమ్‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  ఈ స్కీమ్ కింద 11 రాష్ట్రాల‌కు 3621 కోట్లు విడుద‌ల చేశారు.  ఇన్‌కంట్యాక్స్ రిఫండ్ స్కీమ్ కింద సుమారు 39.7 ల‌క్ష‌ల మంది ప‌న్నుదారుల‌కు దాదాపు 1,32,800 కోట్లు వెన‌క్కి వెళ్లిన‌ట్లు మంత్రి తెలిపారు.