ఆదివారం 24 జనవరి 2021
National - Dec 21, 2020 , 12:56:20

రేపు జాతీయ గణిత దినోత్సవం

రేపు జాతీయ గణిత దినోత్సవం

హైదరాబాద్‌: సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణిత శాస్త్రానికి అద్భుత కానుకను అందించారు. సున్నా ఆవిష్కరణతో గణితశాస్త్రం గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో గణితశాస్త్ర అధ్యయనం వేదకాలం నుంచే ప్రారంభమైంది. దశాంశ పద్ధతిని గుర్తించింది కూడా భారతీయులే కావడం విశేషం. ఆర్యభట్ట కాలాన్ని భారతీయ గణితశాస్త్రానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు. అనంతరం జరిగిన పరణామాల వల్ల గణితంలో భారతీయుల ప్రభ మసకబారింది. మళ్లీ భారతీయ గణిత చరిత్రకు శ్రీనివాస రామానుజన్ వన్నెలద్దాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబర్‌ 22ను జాతీయ గణితశాస్త్ర దినోత్సవంగా జరుపుతున్నారు. 

అపర మేధావి అయిన రామానుజన్‌ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర ఆర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద అయ్యంగార్‌ కుటుంబంలో జన్మించారు. తన పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ బాలునిగా గుర్తింపు పొందారు. 1903లో కుంబకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరారు. అయితే గణితంపై మాత్రమే ఆసక్తి చూపేవాడు. దీంతో మ్యాథ్స్‌ మినహా అన్ని పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 1903లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్ షిప్ పొందాడు. 


డిగ్రీ లేకపోయినా వర్సిటీ ఫెలోషిప్‌

లెక్కల వల్ల కొడుకుకి పిచ్చిపడుతుందేమోనని భయపడిన రామానుజం తండ్రి ఆయనకు పెళ్ళి చేశారు. దీంతో 1912లో మద్రస్‌ పోర్ట్‌ ట్రస్టులో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పుడు ఆయన జీతం రూ.25 మాత్రమే. అయితే గణితంలో ఆయన ప్రతిభను చూసి ఏ డిగ్రీ లేకపోయినప్పటికీ మద్రాసు విశ్వవిద్యాలయం నెలకు రూ.75 ఫెలోషిప్ మంజూరు చేసింది. 1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ హకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను కేంబ్రిడ్జి ప్రొఫెసర్ జీహెచ్‌ హార్డీకి పంపారు. వాటిని పరిశీలించిన హార్డీ.. రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. దీంతో 1914, మార్చి 17న రామానుజన్ ఇంగ్లండ్‌కు ప్రయాణమయ్యారు. 

ఫెలో ఆఫ్‌ ద రాయల్‌ సొసైటీ..

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందే ట్రినిటీ కాలేజీలో చేరారు. 1916లో బీఎస్సీ పూర్తిచేశారు. 1917లో లండన్‌ మ్యాథమెటికల్‌ సొసైటీకి ఎంపికయ్యారు. 1918, ఫిబ్రవరి 28న ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం దక్కింది. ఈ గుర్తింపు పొందిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అదేఏడాది అక్టోబర్‌లో ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవం అందుకున్నారు. ఈ గౌరవం అందుకున్న మొదటి భారతీయుడు రామానుజన్‌ కావడం విశేషం. 1729ని రామానుజన్‌ సంఖ్య అంటారు. రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼ గా లెక్కించారు.  

1919కి భారత్‌కు

ఆరోగ్య సమస్యలతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. తన 32 ఏండ్ల వయస్సులోనే 1926, ఏప్రిల్ 26న తుదిశ్వాస విడిచారు. గణితశాస్త్రంలో ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘జాతీయ గణితదినోత్సవం’గా ప్రకటించింది. 

2012, ఫిబ్రవరిలో 26న మద్రాస్‌ యూనివర్సిటీలో జరిగిన రామానుజన్‌ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రామానుజన్‌ పుట్టినరోజును గణిత దినోత్సవంగా ప్రకటించారు. రామానుజన్‌ 75వ జన్మదినోత్సవం సందర్భంగా 1962లో కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఆయన జీవితం ఆధారంగా ‘ద మ్యాన్‌ హూ నో ఇన్ఫినిటీ’ పేరుతో సినిమా విడుదలయ్యింది.


logo