శుక్రవారం 10 జూలై 2020
National - Jun 28, 2020 , 18:27:15

కరోనా సంసిద్ధతపై శ్వేతపత్రం విడుదల చేయాలి

కరోనా సంసిద్ధతపై శ్వేతపత్రం విడుదల చేయాలి

బెంగళూర్‌ : కర్ణాటక రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, కరోనా సంసిద్ధతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, కరోనా సన్నద్ధతపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని వారి సందేహాలు తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, ఏర్పాటు చేసిన పడకలు, పెంచిన వెంటిలేటర్ల సంఖ్య, కరోనాపై పోరులో భాగస్వాములైన వారికి అందించిన పీపీఈ కిట్లు తదితర అంశాలను ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు.

రాష్ర్టానికి ప్రధాన మంత్రి కేటాయింపులను వెల్లడించాలని ముఖ్యమంత్రి యడ్యూరప్పను డిమాండ్‌ చేశారు. కన్నడ ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం ప్రధాని మోదీని ఏం అడిగారని.? పీఎం కేర్స్‌ నిధి నుంచి ఆయన ఎంత కేటాయించారో చెప్పాలని సీఎం యడ్యూరప్పను ప్రశ్నించారు. ప్రధాని మోదీ, సీఎం యడ్యూరప్ప కీలకమైన లాక్‌డౌన్‌ సమయాన్ని వృథా చేశారని ఆక్షేపించారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడమే లాక్‌డౌన్‌ ఉద్దేశమని కాని ప్రొటోకాల్లో విస్తారంగా మార్పులు చేశారు మినహా ప్రజలకు పరీక్షలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి, ఇతరశాఖ మంత్రులు తన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో విఫలమయ్యాయని, విపక్ష నాయకుడిగా ప్రజల తరుఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తనకుందని పేర్కొన్నారు.


logo